
న్యూఢిల్లీ, వెలుగు: ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బీఆర్‌ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు అనర్హత వేటు వేస్తుందని ఆ పార్టీ నేతలు పగటి కలలు కన్నారని, కానీ.. అసెంబ్లీ స్పీకరే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ఈ వ్యవహారంలో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉటుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వస్తే సిద్ధంగానే ఉన్నామని, ప్రతి చోట కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఓఆర్ఆర్ సమాంతర రైల్వే లైన్ పనులు స్పీడప్ చేయండి..
హైదరాబాద్‌లో ఔటర్ రీజినల్ రింగ్ (ఓఆర్‌ఆర్) రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇది దేశంలోనే మొట్ట మొదటి ఔటర్ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం లోక్‌సభలో రూల్ 377 కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు 8 జిల్లాలు, 14 మండలాలను కలుపుకొని 6 రైల్ ఓవర్ వంతెనలు, రాబోయే రీజినల్ రింగ్ రోడ్‌కు సమాంతరంగా ఈ రైల్వే ప్రాజెక్ట్ ఉండనుందని తెలిపారు.
ఈ ప్రాజెక్టు వ్యయం అంచనా దాదాపు రూ.12 వేల కోట్లని పేర్కొన్నారు. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. ఇది ‘వికసిత్ రాజ్య-వికసిత్ భారత్- 2047 థీమ్” అని పేర్కొన్నారు. లక్ష్యాన్ని సాధించడానికి ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని స్పష్టం చేశారు. ఐటీ హబ్‌లు, ఫార్మాస్యూటికల్ క్లస్టర్‌లు, లాజిస్టిక్ పార్కులు, అభివృద్ధి చెందుతున్న పట్టణ వృద్ధి కేంద్రాలు వంటి కీలక మండలాలను అనుసంధానం చేస్తుందని చెప్పారు.