పీయూ అభివృద్ధికి కృషి చేస్తున్నాం : ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం

పీయూ అభివృద్ధికి కృషి చేస్తున్నాం  : ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం
  • మహబూబ్‌‌నగర్‌‌‌‌ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం 

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని మహబూబ్‌‌నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌రెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీలో విద్యా మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా పీఎం ఉషా నిధుల కింద రూ. 35 కోట్లతో ఇంజినీరింగ్ కాలేజీ, రూ.15 కోట్లతో లా కాలేజీ బిల్డింగ్‌‌, రూ.25 కోట్లతో హాస్టల్స్ బిల్డింగ్‌‌లకు వారు శంకుస్థాపన చేశారు. 

ఎంపీ మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పటి నుంచి యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ విద్యార్థుల కోసం మరో హాస్టల్ భవనం అవసరం ఉందని యూనివర్సిటీ అధికారులు కోరారని, ఈమేరకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఈ భవనాలు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యవంతమైన విద్యావాతావరణాన్ని అందిస్తాయని అన్నారు.

 మహబూబ్ నగర్ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్‌‌ హబ్‌‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉస్మానియా, కాకతీయ, సెంట్రల్ యూనివర్సిటీల స్థాయిలో నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కృషి చేస్తామని స్పష్టం చేశారు. వీసీ శ్రీనివాస్, రిజిస్టర్ రమేశ్‌‌బాబు, జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్‌‌ నర్సింహ్మారెడ్డి, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్‌‌చార్జి గోనెల శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత, వైస్ చైర్మన్ విజయ్ కుమార్, తదితరులు  పాల్గొన్నారు.