నలుగురు పెద్ద మనుషులు.. పంచాయతీలను ఏకగ్రీవం చేస్తున్నరు : పాలమూరు ఎంపీ డీకే అరుణ

నలుగురు పెద్ద మనుషులు.. పంచాయతీలను ఏకగ్రీవం చేస్తున్నరు  : పాలమూరు ఎంపీ డీకే అరుణ
  •   పాలమూరు ఎంపీ డీకే అరుణ ఫైర్

మహబూబ్​నగర్​ అర్బన్, వెలుగు: గ్రామాల్లో నలుగురు పెద్ద మనుషులు కలిసి గ్రామపంచాయతీలను ఏకగ్రీవం చేస్తున్నారని పాలమూరు ఎంపీ డీకే అరుణ ఫైర్​ అయ్యారు. గతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అందరికి నచ్చిన వ్యక్తిని, అందరితో కలిసిపోయే వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకునే వారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి మారిందని, ఎవరి వద్ద డబ్బులు ఎక్కువగా ఉంటే వారినే సర్పంచ్​గా  ఏకగ్రీవం చేస్తున్నారని మండి పడ్డారు. 

నగరంలోని బీజేపీ జిల్లా ఆఫీసులో శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వేలం పాట పాడి, ప్రలోభాలతో ఏకగ్రీవం చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. కోటి రూపాయలకు పంచాయతీలను వేలం పాడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకొని సర్పంచులను ఎన్నుకోవాలని ఎంపీ సూచించారు. 

లక్షలు పెట్టి సర్పంచ్​ పదవి దక్కించుకుంటున్న వారు.. పెట్టుబడి రాబట్టుకునే ఆలోచన చేస్తారు తప్ప, అభివృద్ధిపై శ్రద్ధ పెట్టరని చెప్పారు. ఎన్నికల కమిషన్  బలవంతపు ఏకగ్రీవంపై సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. అనంతరం బండమీదిపల్లి, పాలిటెక్నిక్​​ కాలేజ్​ ఏరియాలను విజిట్​ చేశారు. బండమీదపల్లి చౌరస్తాలో రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా హైవే పనులు చేపట్టాలని ఆఫీసర్లకు సూచించారు. 

బండమీదపల్లి, అల్లీపూర్, గాజులపేట, ఇప్పలపల్లి, తాటికొండ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే పాలిటెక్నిక్​​కాలేజ్​ స్టూడెంట్లు, స్థానికులు రైల్వే ట్రాక్​ దాటడానికి ఇబ్బంది పడుతుండగా.. ఎంపీ రైల్వే అధికారులతో ఫోన్​లో మాట్లాడారు. రైల్వే ట్రాక్​ క్రాసింగ్​ సమయంలో ప్రమాదాలు జరగకుండా గార్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంపీ వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్​రెడ్డి, రాష్ట్ర నాయకురాలు పద్మాజారెడ్డి పాల్గొన్నారు.