- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
గద్వాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు సమానమేనని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. శనివారం గద్వాలలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు కట్టిన ట్యాక్స్‌లను అన్ని రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన సమానంగా పంచుతుందని చెప్పారు. ఢిల్లీని ఢీకొడతానని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, అక్కడ నిధుల కోసం అడుగుతూనే ఇక్కడ లేనిపోని ఆరోపణలు చేస్తూ నాటకాలు ఆడుతున్నాడని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. నెట్టెంపాడు పూర్తి కాలేదని, గట్టు లిఫ్ట్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, జూరాల రిపేర్లు చేయడం లేదన్నారు. డ్యామ్ సేఫ్టీ లో భాగంగా నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జిని రేవులపల్లి దగ్గర నిర్మించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల డెవలప్మెంట్ కు తనవంతు సహకరిస్తానని తెలిపారు. డీకే స్నిగ్దారెడ్డి, ఇన్చార్జి పాపిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, బండల వెంకట్రాములు, బలిగెర శివారెడ్డి, రజక జయ శ్రీ, సమత, రాజగోపాల్, శ్యామ్ రావు పాల్గొన్నారు. అంతకుముందు మల్దకల్ తిమ్మప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గట్టు మండల బీజేపీ అధ్యక్షుడు నాగప్ప చనిపోగా, ఆయన కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు.
