బీజేపీ విధానాలతో పెరుగుతున్న కులవివక్ష

బీజేపీ విధానాలతో పెరుగుతున్న కులవివక్ష
  • సీజేపై బూటు విసరడం, దళిత ఐపీఎస్‌‌ సూసైడ్‌‌ విచారకరం
  • నాగర్‌‌కర్నూల్‌‌ ఎంపీ మల్లు రవి

నాగర్‌‌కర్నూల్‌‌, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో కులవివక్ష పెరిగిపోతోందని నాగర్‌‌కర్నూల్‌‌ ఎంపీ మల్లు రవి విమర్శించారు. దళితులు, నిమ్న వర్గాలపై దాడులు చేస్తూ, బలవంతపు మరణాలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. దళితుల జీవించే హక్కు కాలరాస్తున్న బీజేపీకి అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. హిందువులంతా ఒక్కటేనని చెప్పే ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ చీఫ్‌‌ మోహన్‌‌ భగవత్‌‌ దేశంలో జరుగుతున్న సంఘటనలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు.

సుప్రీంకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ గవాయ్‌‌పై బూటు విసిరిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించిన తీరు దేశంలోని దళితులను నిరాశకు గురిచేసిందన్నారు. బీజేపీ విధానాల కారణంగానే హరియాణాలో దళిత ఐపీఎస్‌‌ సూసైడ్‌‌ చేసుకున్నారని ఆరోపించారు. ఆఫీసర్ల వేధింపుల వల్లే సూసైడ్‌‌ చేసుకుంటున్నానని నోట్‌‌ రాసినా.. ఆ రాష్ట్ర ప్రభుత్వంగానీ, కేంద్రంగానీ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే తాము పార్లమెంట్‌‌లో చేతులకు కట్టుకొని కూర్చోలేమని, దళితులపై జరుగుతున్న దాడులను నిలదీస్తూనే ఉంటామన్నారు. దళిత ఆఫీసర్లు ఆత్మహత్మలు చేసుకోవడం పరిష్కారం కాదని, తిరగబడాలని పిలుపునిచ్చారు. 

దళితులకు చావాల్సిన పరిస్థితులే ఎదురైతే.. అందుకు కారణమైన వారిని చంపిన తర్వాతే.. తమ చావు గురించి ఆలోచించాలని సూచించారు. రాముడి పేరుతో రాజకీయాలు చేసే బీజేపీకి ఆయన పేరు ఎత్తే యోగ్యతే లేదన్నారు. దళితుల హక్కులు, భవిష్యత్, రక్షణ తదితర అంశాలపై త్వరలోనే ఓ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, డీసీసీబీ చైర్మన్‌‌ మామిళ్లపల్లి విష్ణువర్దన్‌‌రెడ్డి, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌‌ ఆనంద్‌‌కుమార్‌‌ పాల్గొన్నారు.