3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే తర్వాత ఏమిటి? : ఎంపీ రఘునందన్ రావు

3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే తర్వాత ఏమిటి?  : ఎంపీ రఘునందన్ రావు
  • ఈ అంశంపై సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండు
  • తీర్పును స్వాగతిస్తున్నం: ఎంపీ రఘునందన్ రావు

న్యూఢిల్లీ, వెలుగు: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. అయితే అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఆ తర్వాత ఏమిటి అనేది అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంలో సీజేఐ ధర్మాసనం క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండు అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల జడ్జిమెంట్​లో స్పీకర్ కు నిర్ణీత సమయం పెట్టారు. ఒక వేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే.. మళ్లీ కోర్టుకు వెళ్లాల్సిందే.

ఈ విషయంలో ధర్మాసనం స్పష్టత ఇస్తే బాగుండు’’  అని పేర్కొన్నారు. గురువారం కోర్టు తీర్పు అనంతరం రఘునందన్ రావు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ‘‘స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆశించడం... శాసించడం వేరు. ఈ సున్నితమైన విషయంలో తేడాతో... నేతలు పార్టీలు మారుతున్నారు. అయితే స్పీకర్ ప్రజల పక్షాన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్  ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి” అని వ్యాఖ్యానించారు.  

హిందువులను తీవ్రవాదులుగా కాంగ్రెస్​ చిత్రీకరిస్తున్నది

2008 ఏడాదిలో యూపీఏ– 1 ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించే ప్రయత్నం చేసిందని, ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు గాను కాంగ్రెస్​ నేతలు మాలేగావ్ కేసులో హిందువులను టెర్రరిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఎంపీ రఘునందన్​రావు ఆరోపించారు. ఇందులో భాగంగానే నిర్దోషుల్ని దోషులుగా ప్రచారం చేశారని ఆయన అన్నారు. అప్పటి మాలేగావ్, ఇప్పటి పహల్గాం అయినా కాంగ్రెస్ వైఖరి ఒక్కటే అని  ఆయన మండిపడ్డారు.