కాంగ్రెస్ లోకి టీడీపీ పాత నేతలు!.. ఇండ్లకు వెళ్లి ఆహ్వానిస్తున్న రేవంత్

 కాంగ్రెస్ లోకి  టీడీపీ పాత నేతలు!.. ఇండ్లకు వెళ్లి ఆహ్వానిస్తున్న రేవంత్

హైదరాబాద్: పాత టీడీపీ నేతలు ఒక్కొక్కరు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ ఎన్నికల్లో మరో మారు తమ రాజకీయ భవిష్యత్ ను పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి హరీశ్​ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ నేత, మల్కాజ్ గిరి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిన్న మండవను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టు సమాచారం. 

నిజామాబాద్ రూరల్ నుంచి పోటీకి అవకాశం కల్పిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు ఆయన సానుకూలంగా ఉన్నట్టు  ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇందుకోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. మరో సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఇటీవల రేవంత్ రెడ్డి  రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిసి కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రేపు ఆయన హస్తం పార్టీలో చేరనున్నారని సమాచారం.  

రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం కోసం గత కొద్దిరోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్టులో నర్సంపేట కాంగ్రెస్ అభ్యర్థిగా దొంతి మాధవరెడ్డి పేరును ప్రకటించింది. దీంతో ఆయన ప్రస్తుతం పరకాల స్థానాన్ని కోరుతున్నట్టు సమాచారం.  మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనుకుంటున్న రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నుంచి తన విజయం ఈజీ అని భావిస్తున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి పరకాల నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది.