జహీరాబాద్ సెగ్మెంట్​లో ‘బీసీ’ జపం

జహీరాబాద్ సెగ్మెంట్​లో ‘బీసీ’ జపం
  • మూడు ప్రధాన పార్టీల టికెట్లు ఆ వర్గానికే
  • కాంగ్రెస్​, బీజేపీ నుంచి బరిలో లింగాయత్ నేతలు
  • మున్నూరుకాపు లీడర్ కు టికెట్ ​ఖరారు చేసిన బీఆర్​ఎస్
  • రసవత్తరంగా పార్లమెంట్​ పోరు

కామారెడ్డి, వెలుగు : జహీరాబాద్​ పార్లమెంట్​ సెగ్మెంట్​ పరిధిలో ఈ సారి ప్రధాన పార్టీలన్ని బీసీ మంత్రాన్ని జపిస్తున్నాయి.కాంగ్రెస్​, బీజేపీ ఇదివరకే లింగాయత్​ సామాజికవర్గానికి చెందిన లీడర్లకు టికెట్​ కేటాయించగా, తాజాగా బీఆర్​ఎస్​ సైతం మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నేతకు టికెట్​ ఖరారు చేసింది. దీంతో పార్లమెంట్​ పోరు రసవత్తరంగా మారనుంది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, సంగారెడ్డిలోని మూడు నియోజకవర్గాలు జహీరాబాద్​ పార్లమెంట్​పరిధిలోకి వస్తాయి. మొత్తం 16,24,846 మంది ఓటర్లుండగా

ఇందులో 55  శాతం మంది బీసీలే ఉన్నారు. పార్లమెంట్​సెగ్మెంట్​పరిధిలోని నారాయణ్​​ఖేడ్​, జహీరాబాద్​, జుక్కల్​ అసెంబ్లీ నియోజకవర్గాల్లో లింగాయత్​ ఓట్లర్ల సంఖ్య అధికంగా ఉండగా, మున్నూరుకాపు, ముదిరాజులు కూడా ఎక్కువగానే ఉన్నారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ముదిరాజులు, మున్నూరు కాపులు అధికంగా ఉన్నారు. ఆయా పార్టీల గెలుపోటముల్లో బీసీలు కీలకంగా నిలువనున్నారు.

కుల సమీకరణాలే ప్రధానం

బీఆర్​ఎస్​ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్​ ఎంపీ బీబీ పాటిల్​ ఇటీవల బీజేపీలో చేరారు. పార్టీ మారిన మరుసటి రోజే బీజేపీ పాటిల్​ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కాంగ్రెస్​ పార్టీ విడుదల చేసిన మొదటి లిస్ట్​లోనే మాజీ ఎంపీ సురేశ్​ శెట్కార్​ పేరును ప్రకటించింది. పార్లమెంట్​ సెగ్మెంట్ పరిధిలో లింగాయత్​ ఓటర్ల ప్రాబల్యం ఉన్న నేపథ్యంలో రెండు పార్టీలు కూడా ఆ సామాజికవర్గానికి చెందిన నేతలనే బరిలో నిలిపారు. బీజేపీ నుంచి పలువురు టికెట్​ఆశించగా, కుల సమీకరణాల నేపథ్యంలో పార్టీ మాత్రం సిట్టింగ్​ ఎంపీగా ఉన్న బీబీపాటిల్​ వైపే మొగ్గు చూపింది.

ఈయన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో పాటు బీసీ కార్డు పని చేస్తుందని పార్టీ ముఖ్య నేతలు భావించారు. ఇతర సామాజికవర్గాలకు చెందిన వారికి టికెట్​ కేటాయిస్తే బీసీ ఓట్లు చీలి విజయవకాశాలు దెబ్బతింటాయనే ఉద్ధేశంతో కాంగ్రెస్​ పార్టీ మాజీ ఎంపీ సురేశ్​ శెట్కార్​కు టికెట్​ కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈయనకు నారాయణ్​ఖేడ్​ టికెట్​ కేటాయించారు. కానీ చివరి నిమిషంలో టికెట్​ మార్చి సంజీవ్​రెడ్డిని బరిలో నిలిపారు. ఎంపీ టికెట్​ఇస్తామని హైకమాండ్​ భరోసా ఇవ్వడంతో ఆయన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు. మాజీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి తనయుడు

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా డీసీసీబీ చైర్మన్​ పోచారం భాస్కర్​రెడ్డి బీఆర్​ఎస్​ నుంచి ఎంపీ టికెట్​ ఆశించారు. ఈ నెల 10న జహీరాబాద్​ పార్లమెంట్​ పరిధిలోని ముఖ్య నేతలతో హైదారాబాద్​లో మీటింగ్​ నిర్వహించిన కేసీఆర్, ఎంపీ అభ్యర్థిత్వం ఖరారుపై లీడర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. కాంగ్రెస్​, బీజేపీలు బీసీ సామాజికవర్గాలకు చెందిన అభ్యర్థులను బరిలో దింపిన నేపథ్యంలో, తమ పార్టీ నుంచి కూడా బీసీ నేతనే బరిలో నింపాలనే అభిప్రాయాన్ని వెల్లుబుచ్చారు. ఆ తర్వాత మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన గాలి అనిల్​కుమార్​ అభ్యర్థిత్వాన్ని బీఆర్​ఎస్​ ఖరారు చేసింది. దీంతో టికెట్​ఆశించిన భాస్కర్​రెడ్డికి నిరాశే మిగిలింది.