70 స్థానాల్లో గెలిచి.. అధికారంలోకి వస్తం : ఉత్తమ్

70 స్థానాల్లో గెలిచి.. అధికారంలోకి వస్తం : ఉత్తమ్
  • రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు

సూర్యాపేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, అభివృద్ధిలో టాప్ ప్లేస్​లో ఉన్నామంటూ ఊదరగొడ్తున్నారని విమర్శించారు. తలసరి అప్పుల్లో, మద్యం వినియోగంలో, అవినీతిలో మాత్రమే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారని ఎద్దేవా చేశారు. సూర్యాపేటలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మంగళవారం చిట్ చాట్ చేశారు. అవినీతికి అలవాటుపడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సాధారణ ప్రజలను హింసిస్తున్నారని అన్నారు. 

‘కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేయడానికి నేను, నా భార్య సిద్ధంగా ఉన్నాం. కోదాడ, హుజూర్​నగర్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 సీట్లు క్లీన్ స్వీప్ చేస్తాం. దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారు. మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చాలా మందికి రాలేదు”అని ఉత్తమ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు చూస్తుంటే అవినీతిపరులకు, దోపిడీదారులకు తలుపులు బార్లా తెరిచినట్టు అనిపిస్తున్నదని, అలాంటి వాళ్లకు సీట్లిచ్చి కాంగ్రెస్ గెలుపును సునాయసం చేశారని అన్నారు. కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని, గతంలో లెక్క ఇప్పుడు కేసీఆర్ గెలిచే పరిస్థితి లేదని విమర్శించారు. కాంగ్రెస్ టికెట్లు కూడా అధిష్టానం త్వరలోనే ప్రకటిస్తుందని అన్నారు.