అత్తింటి నుంచి వెళ్లిపోయిందని చెట్టుకు వేలాడదీసి కొట్టారు

అత్తింటి నుంచి వెళ్లిపోయిందని చెట్టుకు వేలాడదీసి కొట్టారు

భోపాల్: మధ్యప్రదేశ్‌లో 20 ఏండ్ల యువతిని సొంత అన్నదమ్ములే చెట్టుకు వేలాడదీసి కర్రలతో కొట్టారు. అత్తారింటి నుంచి వెళ్లిపోయిందన్న కారణంతో వాళ్లు ఆమెను దారుణంగా హింసించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు గుర్తించి, కేసు ఫైల్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
అలీరాజ్‌పూర్ జిల్లాలోని బడేపూల్ తలావ్ గ్రామానికి చెందిన 20 ఏండ్ల మహిళకు బుర్చవాడి గ్రామానికి చెందిన యువకుడితో ఇటీవలే తల్లిదండ్రులు పెండ్లి చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమెను ఇంటి దగ్గరే వదిలిపెట్టి భర్త గుజరాత్‌లో పని చేసుకునేందుకు వలస వెళ్లాడు. అయితే అక్కడ అతడు లేకుండా ఉండడం ఇబ్బందికరంగా అనిపించడంతో ఆ మహిళ తన మేనమామ ఇంటికి వెళ్లిపోయింది. ఈ విషయం అత్తారింటి వారి ద్వారా ఆ మహిళ తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆ మహిళను తన అన్నదమ్ములు తమ ఇంటికి తీసుకెళ్లి.. ఆమె నడుముకు తాడు కట్టి చెట్టుకు వేలాడదీసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది. అయితే ఆ సమయంలో కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేశారు. అత్తారింటి నుంచి వెళ్లిపోయిందన్న కోపంతో ఆ మహిళను తన నలగురు అన్నదమ్ములే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించామని, వారిని అరెస్టు చేశామని అలీరాజ్‌పూర్ జిల్లా ఎస్పీ విజయ్ భగ్వావి శనివారం మీడియాకు వెల్లడించారు.