కామారెడ్డిలో జడ్పీటీసీపై ఎంపీపీ దాడి

కామారెడ్డిలో జడ్పీటీసీపై ఎంపీపీ దాడి
  •     కామారెడ్డి   బీఆర్​ఎస్ లో గ్రూపుల కొట్లాట 
  •     ఎమ్మెల్యే ఇంటి ముందు  జడ్పీటీసీ అనుచరుల ఆందోళన

కామారెడ్డి, కామారెడ్డిటౌన్​,  వెలుగు : కామారెడ్డి బీఆర్​ఎస్​లో మరోసారి గ్రూపులు బజార్న పడ్డాయి.  స్వయంగా కేసీఆర్​ పోటీ చేస్తున్నప్పటికీ పార్టీ నేతల్లో సఖ్యత కనిపించడంలేదు. మాచారెడ్డి  జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డిపై   ఎంపీపీ నర్సింగ్​రావుపై  దాడి చేయడంతో  శనివారం  జడ్పీటీసీ అనుచరులు  ఆందోళనకు దిగారు. ఎంపీపీపై చర్య తీసుకోవాలంటూ  కామారెడ్డిలోని  ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ఇంటి ముందు ధర్నా  చేశారు.  నర్సింరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. జడ్పీటీసీ, ఎంపీపీ  వర్గాలు మాచారెడ్డిలో పరస్పరం  దిష్టిబొమ్మలను కాలబెట్టారు.

శుక్రవారం రాత్రి ఉమ్మడి మాచారెడ్డి మండల బీఆర్​ఎస్​ లీడర్ల మీటింగ్  జరిగింది. ఈ మీటింగ్​లో   జడ్పీటీసీ రాంరెడ్డి, ఎంపీపీ నర్సింగ్​రావుల మధ్య  మాటామాటా పెరిగింది. తన  సొంతూరి వ్యవహారాల్లో   జోక్యం చేసుకొవటం ఏమిటని  జడ్పీటీసీ ఎంపీపీని ప్రశ్నించారు.  దాంతో  నర్సింగరావు  జడ్పీటీసీపై దాడి  చేయగా..   జడ్పీటీసీ చొక్కా చినిగి, ముఖానికి గాయమైంది. అయితే నర్సింగరావు దాడికి దిగలేదని అతని వర్గీయులు చెప్తున్నారు.  చుక్కాపూర్​లో ఎంపీపీ దిష్టిబొమ్మను జడ్పీటీసీ వర్గం తగలబెట్టింది.  ఎంపీపీ వర్గీయులు కూడా మాచారెడ్డి, ఎల్లంపేట, ఇసాయిపేట, భవానిపేటల్లో  జడ్పీటీసీ దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు.  

జడ్పీటీసీని పరామర్శించిన  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ  

జడ్పీటీసీ రాంరెడ్డిని  కామారెడ్డిలోని  ఆయన నివాసంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్​,  ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ ముజీబొద్ధిన్​, నేతలు  తిర్మల్​రెడ్డి, వేణుగోపాల్​రావు పరామర్శించారు.  ఘటన తీరును అడిగి తెలుసుకున్నారు.  జడ్పీటీసీ రాంరెడ్డిపై దాడిని రెడ్డి ఐక్య వేదిక ఖండించింది.  రెడ్డి సామాజిక వర్గంపై పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని  ఐక్య వేదిక స్టేట్​ ప్రెసిడెంట్​ ఏనుగు సంతోష్​రెడ్డి అన్నారు.  నర్సింగ్​రావును పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్​ చేయాలన్నారు. ఆదివారంలోగా  చర్య తీసుకోకపోతే  బీఆర్​ఎస్​ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని  బహిష్కరిన్నామన్నారు.