ఎమ్మెల్యే సైదిరెడ్డిపై హైకమాండ్‌‌కు ఫిర్యాదు చేస్తా :  హుజూర్‌‌నగర్‌‌ ఎంపీపీ

ఎమ్మెల్యే సైదిరెడ్డిపై హైకమాండ్‌‌కు ఫిర్యాదు చేస్తా :   హుజూర్‌‌నగర్‌‌ ఎంపీపీ

సైదిరెడ్డిపై హైకమాండ్‌‌కు ఫిర్యాదు చేస్తా
హుజూర్‌‌నగర్‌‌ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌‌
కోర్టు ఆర్డర్​ ఉన్నా ఇల్లు కూలగొట్టించారని ఫైర్​ 

హుజూర్ నగర్, వెలుగు: ఎమ్మెల్యే సైదిరెడ్డి కక్ష గట్టి తాను కట్టుకుంటున్న ఇంటిని అక్రమ నిర్మాణమంటూ కూల్చేయించారని రూలింగ్​ పార్టీకే చెందిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్  ఎంపీపీ  గూడెపు శ్రీనివాస్ మండిపడ్డారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణం మొదలు పెట్టానని, తనకు ఏ మాత్రం టైమ్​ ఇవ్వకుండా ఇల్లు కూలగొట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే సైదిరెడ్డిపై పార్టీ హైకమాండ్​కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.  పట్టణంలోని సర్వే నెం 204  లో  2017లోనే  300 గజాల స్థలాన్ని చల్లా నాగేశ్వర రావు నుంచి కొన్నట్టు, అందులో 150 గజాలు మందడి నారాయణకు అమ్మినట్టు వివరించారు.

మిగిలిన150 చదరపు గజాల స్థలాన్ని  తన భార్య  గూడెపు సీతమ్మ పేరుతో  గిఫ్ట్ డీడ్ చేసినట్టు, ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు  అనుమతి కోరుతూ 2019 అక్టోబర్​19న  ఫీజు కట్టి దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు.  2021 జనవరి లో  ఇల్లు నిర్మాణం ప్రారంభించి  మొదటి అంతస్తు శ్లాబ్ వరకు కట్టగా  ఆ స్థలం లే అవుట్ పరిధిలో ఉందని అంటూ  మున్సిపల్ ఆఫీసర్లు   పనులు ఆపి .. సీజ్ చేశారన్నారు.   

తాను హైకోర్టును ఆశ్రయించగా   2021 జనవరిలో నిర్మాణానికి అనుమతిస్తూ  ఆర్డరు ఇచ్చారన్నారు. తిరిగి  నిర్మాణ పనులు చేస్తుండగా  ఈ నెల 18 న   మున్సిపల్ అధికారులు జేసీబీతో ఇల్లు  కూల్చివేశారన్నారు.  తనకు 2 గంటలు టైమ్​ ఇవ్వాలని కోరినా వినకుండా తనను పోలీసు స్టేషనుకు తరలించారన్నారు.   కాంగ్రెస్ నుంచి గెలిచిన తాను సరైన గౌరవం ఇస్తామంటేనే  టీఆర్ ఎస్​లో చేరానని, అలాంటి తనను  వేధించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు . తన ఇల్లు  అక్రమమని తేలితే ఇంటిని  మున్సిపాలిటీకే రాసిస్తానని చెప్పినా వినలేదన్నారు.

తాను ప్రభుత్వ స్థలాన్ని  కబ్జా చేసినట్టు  నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. ఎమ్మెల్యే ఆగడాలను సహించేది లేదని , ఎమ్మెల్యే   భూ కబ్జాలను , కమీషన్ల లెక్కలను త్వరలో బయటపెడతానని హెచ్చరించారు. ఆయన నియోజకవర్గంలో పార్టీని నాశనం చేస్తున్నారని,  మంత్రి జగదీశ్వర్ రెడ్డి తో  కలిసి సీఎం కేసీఆర్ , కేటీఆర్ కు అన్ని విషయాలు చెప్తానన్నారు.   శ్రీనివాస్​పై వేధింపులు ఆపకుంటే  నిరసనలు చేపడతామని యస్​సీ చాకలి సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తకొండ  శ్రీలక్ష్మి అన్నారు.  కార్యక్రమం లో గూడెపు చంద్రయ్య , వెంకట నారాయణ తదితరులు  పాల్గొన్నారు.