ఖాకీలు గులాబీరంగు పూసుకోవద్దు: సంజయ్, అర్వింద్

ఖాకీలు గులాబీరంగు పూసుకోవద్దు: సంజయ్, అర్వింద్

టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని అన్నారు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్. బెంగాల్ తరహా రాజకీయాలను టీఆర్ఎస్ పార్టీ చేస్తోందని.. బీజేపీ వాటిని అడ్డుకుంటుందని చెప్పారు.

సిరిసిల్ల వేములవాడ జిల్లా… కొడిముంజ ముంపు గ్రామస్తులతోపాటు….. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్. ఎల్లమ్మ గుడి దగ్గర జరిగిన సంఘటనలో గౌడ కులస్తులపై టీఆర్ఎస్ నాయకులు దాడిచేశారని.. పోలీసులు రివర్స్ లో 13 మంది బాధితులపైనే కేసులు పెట్టి.. రిమాండ్ చేసి… 33రోజుల పాటు జైల్లో పెట్టారని.. బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో వాదించారని అన్నారు. హైదరాబాద్ లో గౌడ కులస్తులు ఆందోళన తెలపడంతో.. టీఆర్ఎస్ నేతలు మళ్లీ బెయిల్ ఇప్పించారని అన్నారు. పోలీసులు టీఆర్ఎస్ నేతలకు అండగా వ్యవహరించారని.. గాయాలపాలైన బాధితులు, అమాయకులను జైలుపాలు చేశారని ఆరోపించిన బండి సంజయ్… బాధితులకు జరిగిన అన్యాయాన్ని కేంద్రానికి వివరించామన్నారు. గత ఎన్నికల్లో గౌడ కులస్తులు బీజేపీకి ఓటేశారనే కక్షతోనే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కొడిముంజ సంఘటన.. రాష్ట్రంలో మరో నేరెళ్ల లాంటి సంఘటనే అన్నారు. కేసీఆర్, కేటీఆర్ హయాంలో అరాచక పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ నయా నిజాంగా మారారని అన్నారు. దేవుడికి పూజ చేస్తుంటే దాడిచేయడం దారుణం అన్నారు. ఈ వ్యవహరాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామనీ.. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని… జాతీయ బీసీ కమిషన్ ని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.

బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు , అధికారులు… అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రగాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. ఒక కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తోందని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్టులకు పాల్పడుతున్నారనీ.. ఎన్ఆర్ఐలపైనా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తి ఇంటలిజెన్స్ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 8 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ఫేస్ బుక్ లో పోస్టు పెడితే అతన్ని అరెస్ట్ చేసి.. పాస్ పోర్ట్ సీజ్ చేశారని అన్నారు. 16 సీట్లు వస్తాయన్న సీఎం పైన కూడా కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఖాకీని కల్తీ చేస్తోందని.. పార్టీ కండువాను.. గులాబీ రంగును ఖాకీలు కప్పుకోవద్దని అర్వింద్ అన్నారు.