దిశ మీటింగ్కు సీనియర్​ అధికారులు రాకపోవడంపై ఎంపీల ఫైర్​

దిశ మీటింగ్కు సీనియర్​ అధికారులు రాకపోవడంపై ఎంపీల ఫైర్​
  • కేంద్రం ఒక్కపైసా ఇయ్యడం లేదన్న ఎంపీ నామా
  • పనులు స్లోగా జరుగుతున్నాయని అధికారులపై ఆగ్రహం
  • ప్రధాన అంశాలపైనే కొనసాగిన చర్చ

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఎంతో ప్రాధాన్యత కలిగిన ‘దిశ’ మీటింగ్​కు ఉన్నతాధికారులు హాజరు కాకుండా కింది స్థాయి ఆఫీసర్లను పంపించడంపై ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్​లో శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ సమావేశం మహబూబాబాద్​ ఎంపీ మాలోత్​ కవిత అధ్యక్షతన జరిగింది. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రివ్యూ చేస్తూ జిల్లాలో పనులు స్లోగా జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల పురోగతి గురించి తమకు సమాచారం ఉండడం లేదని ఆరోపించారు.  అధికారుల తీరుపై ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్​ కవితతో పాటు ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, బానోత్​ హరిప్రియ మండిపడ్డారు. ఎజెండాలో 42 అంశాలు ఉండగా, కొన్ని అంశాలపైనే చర్చించారు.

కేంద్రం నిధులు రావట్లే..

కేంద్రం నుంచి నిధులు సరిగా రావట్లేదని ఖమ్మం ఎంపీ నామానాగేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం–సత్తుపల్లి, కొవ్వూరు రైల్వే లైన్​ కోసం ఎన్నిసార్లు లేఖ రాసినా ఫలితం లేదన్నారు. కొవ్వూరు రైల్వే లైన్, భద్రాచలం రైల్వే స్టేషన్​ గురించి రైల్వే శాఖ పట్టించుకోవడం లేదన్నారు. అధికారుల వద్ద పూర్తి స్థాయిలో వివరాలు లేకపోవడం, గతంలో చర్చించిన అంశాలపై యాక్షన్​ టేకెన్​ రిపోర్ట్​ సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు సీఎస్ఆర్​ ఫండ్స్​ కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దేశంలో 5జీ నెట్వర్క్​ వస్తుంటే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇంకా 2జీ, 3జీకే పరిమితం కావడం సరైంది కాదన్నారు. సిగ్నల్స్​ లేక ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్​తో 1100 ఎకరాలకు పైగా ముంపునకు గురవుతుందని, భద్రాచలం పట్టణానికి ముంపు ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రోటోకాల్​ పాటించకుండా ప్రజాప్రతినిధులను అవమాన పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, క్రీడా మైదానాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఇల్లందు హాస్పిటల్​కు డయాలసిస్​ సెంటర్​ మంజూరైనా పనులు ప్రారంభం కాలేదన్నారు. నేషనల్​ హైవే పనులు స్లోగా సాగుతున్నాయని చెప్పారు.

సమస్యలు పరిష్కరించండి..

జిల్లాలోని ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరతతో ప్రజలకు వైద్యం అందడం లేదని ఎంపీపీలు, దిశ కమిటీ సభ్యులు వాపోయారు. ఇల్లందు హాస్పిటల్​లో గైనాకాలజిస్ట్​లు, పిల్లల డాక్టర్లు లేక ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. కేసీఆర్​ కిట్​కు సంబంధించి డబ్బులు రావడం లేదన్నారు. అప్పులు చేసి ఇంకుడు గుంతలు నిర్మించామని, బిల్లులు రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని చెప్పారు. ఈజీఎస్​ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మైనర్లు, ఆశ కార్యకర్తలకు జాబ్​ కార్డులు ఇచ్చి డబ్బుల కాజేస్తున్నారని ఆరోపించారు. రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో కొందరు డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమావేశంలో ప్రస్తావించారు. ప్రతి మండలానికి అంబులెన్స్​లు ఉండేలా చూడాలన్నారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, కలెక్టర్​ అనుదీప్, అడిషనల్​ కలెక్టర్​ కె వెంకటేశ్వర్లు, డీఆర్డీవో మధుసూదనరాజు, మున్సిపల్​ చైర్​పర్సన్​ కె సీతాలక్ష్మి పాల్గొన్నారు. మీటింగ్​కు హాజరైన వారికి కుర్చీలు లేకపోవడంతో నిలబడాల్సి వచ్చింది.