
Mrinal Thakur : మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులలో మారుమోగుతోంది. తన సహజమైన నటన, అందం, విభిన్న పాత్రల ఎంపికతో మృణాల్ అనతికాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులో ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని మంచి ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకుంది. మృణాల్ ఠాకూర్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది 'సీతారామం' (2022) చిత్రంతో. దుల్కర్ సల్మాన్ సరసన సీత మహాలక్ష్మి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ప్రేమ, వియోగం, త్యాగం వంటి భావోద్వేగాలను ఆమె అద్భుతంగా పలికించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, మృణాల్‌కు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది.
అజయ్ దేవగణన్‌తో రోమాన్స్
ఇప్పుడు మృణాల్ ఠాకూర్ బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం56 ఏళ్ల హీరో అజయ్ దేవగణన్ ( Ajay Devgn ) తో 'సన్ ఆఫ్ సర్దార్ 2' 'Son of Sardaar 2'లో రోమాన్స్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 2010లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన 'మర్యాద రామన్న' తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. హాస్యనటుడు సునీల్ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా కంటెంట్ ఇతర భాషల వారికి కూడా నచ్చడంతో, పలు భాషల్లో రీమేక్ అయ్యింది. హిందీలో అజయ్ దేవగణ్ 'సన్ ఆఫ్ సర్దార్' పేరుతో 2012లో రీమేక్ చేసి, అక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ సిద్ధమైంది. 'సన్ ఆఫ్ సర్దార్ 2' పేరుతో ఈ సినిమా జూలై 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి భాగంలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించగా, ఈ సీక్వెల్‌లో మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో కనిపించనుంది.
పంజాబీ సర్దార్ స్కాట్‌లండ్‌లో!
'సన్ ఆఫ్ సర్దార్ 2' ట్రైలర్ విషయానికి వస్తే, మొదటి భాగానికి కొనసాగింపుగా, వినోదభరితంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ప్రకారం, ఒక పంజాబీ సర్దార్ స్కాట్‌లండ్‌కు వెళ్తాడు. అక్కడ అతను హీరోయిన్ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నంలో ఊహించని సమస్యల్లో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు, తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు అన్నదే ఈ సినిమా కథాంశంగా కనిపిస్తోంది. మొదటి భాగాన్ని మించిపోవాలని చిత్రబృందం చేసిన ప్రయత్నం ట్రైలర్‌లో కనిపిస్తోంది. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్‌ను సమపాళ్లలో కలిపి వినోదభరితమైన చిత్రాన్ని అందించాలని ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. అయితే, ట్రైలర్ చూసిన తర్వాత, పెద్దగా ఆకట్టుకునే మెరుపులు లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. "ఓకే ఓకే" అన్న స్థాయిలో ఉందని, ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచేంతటి అంశాలు కనిపించలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ALSO READ : Rajinikanth : కూలీ Vs వార్ 2.. తలైవా దూకుడుతో డీలాపడ్డ ఎన్టీఆర్, ప్రభాస్!
ఈ సినిమా జూలై 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి మృణాల్ ఠాకూర్, 56 ఏళ్ల హీరోతో తెర పంచుకోవడం. వీరి మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. ట్రైలర్‌లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా చూపించారు. వయసులో చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ, తెరపై వారిద్దరి జోడీ ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.