ముక్కోటి ఏకాదశి: చిగురుమామిడిలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు

ముక్కోటి ఏకాదశి: చిగురుమామిడిలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. డిసెంబర్ 23వ తేదీ శనివారం తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు  చేరుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఆలయాలకు చేరుకుని దర్శించుకుంటున్నారు.

 కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో  రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతర ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను గెలిపించిన హుస్నాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.  

రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి  పొన్నం తెలిపారు.  రాష్ట్రంలోని ప్రజా సమస్యలను పరిష్కరించేలా తనకు భగవంతుడు ఆశీస్సులు అందించాలని వేడుకున్నట్లు ఆయన చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంతరి తుమ్మల కుటుంబ సమేతంగా యాదాద్రిలో  లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ధర్మపురిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.