అభ్యుదయానికి ఆద్యుడు ముళ్లపూడి

అభ్యుదయానికి ఆద్యుడు ముళ్లపూడి

కొంతమంది గురించి చెప్పడానికి ఏమీ ఉండదు.
కానీ కొంతమంది గురించి ఎంత చెప్పినా తరగదు.
ముళ్లపూడి వెంకట రమణ గురించి కూడా అంతే.. 
ఆయన గురించి చెప్పేకొద్దీ మాటలు మరింతగా పుట్టుకొస్తాయి. రాసేందుకు అక్షరాలు చాలనంటాయి.
తెలుగు సాహితీ చరిత్రలో అంత గొప్ప అధ్యాయం ఆయనది.
కలం బలంతో కోట్లాదిమందిని కట్టి పడేసిన ఘనత ఆయనది.
ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయానికి ఆద్యుడైన ముళ్లపూడి వారి గురించి.. ఆయన జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు. 

గోదారమ్మ ఒడిలో పుట్టి, ఆదిలక్ష్మమ్మ ఒడిలో పెరిగి..

1931లో రాజమండ్రి దగ్గరున్న ధవళేశ్వరంలో ముళ్లపూడి వెంకట రమణ జన్మించారు. ఊహ తెలియకముందే తండ్రి చనిపోయాడు. పొట్టకూటి కోసం తల్లి  ముగ్గురు పిల్లల్నీ తీసుకొని మద్రాసుకు చేరింది. విస్తరాకులు కుట్టింది. ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేసింది. ఎంతో కష్టపడి పిల్లల కడుపు నింపింది. నాడు అమ్మపడిన కష్టాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు ముళ్లపూడి. తనకు అమ్మ,  ఫ్రెండ్,  గురువు అన్నీ ఆమే అనేవారు. అమ్మ తనకు బతకడం నేర్పించిందని, తీసుకోవడం కంటే ఇవ్వడం గొప్పదనే నీతిని బోధించిందని చెప్పేవారు. అలా గోదారమ్మ ఒడిలో పుట్టి, ఆదిలక్ష్మమ్మ ఒడిలో పెరిగి పెద్దయ్యారు ముళ్లపూడి. 

అక్షరంపై ప్రేమ

కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ముళ్లపూడి చదువు సాఫీగా సాగలేదు. అయినా కష్టపడి ఎస్సెస్‌ఎల్సీ ఆనర్స్ వరకు వెళ్లారు. స్కూల్లో ఉండగానే సాహిత్యంపై మక్కువ ఏర్పడింది. డిబేట్లలో అద్భుతంగా మాట్లాడేవారు. వ్యాస రచన పోటీల్లో ప్రతిభ కనబర్చి బహుమతులు గెల్చుకునేవారు. నాటకాల్లో వేషాలు వేసేవారు. అలవోకగా పద్యాలు అల్లి పాడేసేవారు. మెల్లగా కథలు రాయడమూ మొదలుపెట్టారు. ఆయన మొదటి కథ ‘అమ్మ మాట వినకపోతే’..  1945లో ‘బాల’ పత్రికలో ఇది అచ్చయ్యింది. ‘బాలశతకం’ పేరుతో పద్యాలు కూడా పబ్లిష్ అయ్యాయి. దాంతో అక్షరంపై ఆయనకు మరింత ప్రేమ పెరిగింది. కుటుంబ సమస్యల వల్ల చదువు ఆపేసిన ముళ్లపూడి.. ఆంధ్రపత్రికలో సబ్‌ ఎడిటర్‌‌గా చేరారు. అక్కడి నుంచి ఆయన కలం కదం తొక్కింది. వందలాది కథలు, రాజకీయ వ్యంగ్యాస్త్రాలు, హాస్య రచనలు చేశారు. ‘ఉదయభాను’ పేరుతో సొంత పత్రిక మొదలుపెట్టారు. దానికి ఆయనే ఎడిటర్. తన స్నేహితుడు బాపూయే చిత్రకారుడు. ఇద్దరూ కలిసి ఆ పత్రికను ఎంతో శ్రద్ధగా నడిపేవారు. అప్పటి నుంచే వాళ్ల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. 

సినీ ప్రస్థానం

ఆంధ్రపత్రికలో ‘ముళ్లపూడి’ రాసిన కాలమ్స్ చాలా పాపులర్ అయ్యాయి. పలువురు సాహితీ ప్రియులతో పాటు సినీ రంగంలోని ప్రముఖులు కూడా వాటిని చదివేవారు. వారిలో నిర్మాత డీబీ నారాయణ ఒకరు. ముళ్లపూడి రచనా విధానానికి ఫిదా అయిన నారాయణ.. తాను తీస్తున్న ‘దాగుడు మూతలు’ సినిమాకు రచన చేయమని అడిగారు. ముళ్లపూడి ఇష్టపడలేదు. కానీ నారాయణ పదే పదే అడగడంతో ఎట్టకేలకు సరే అన్నారు. అయితే ‘దాగుడుమూతలు’ చిత్రీకరణ చాలా ఆలస్యమయ్యింది. ఇంతలో ఎన్టీఆర్‌‌తో డూండీ తీసిన ‘రక్తసంబంధం’ సినిమాకు వర్క్ చేశారు ముళ్లపూడి. అది అనుకున్న సమయానికే రిలీజయ్యింది. దాంతో ముళ్లపూడి మొదటి సినిమా ‘రక్త సంబంధమే’ అయ్యింది. ఆ తర్వాత గుడిగంటలు, మూగమనసులు లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఆయన సినీ ప్రయాణం నల్లేరు మీద నడకలా సాగిపోయింది. ఇద్దరు మిత్రులు, వెలుగు నీడలు, ప్రేమించి చూడు, నవరాత్రి, పూలరంగడు, సాక్షి, బంగారు పిచ్చుక, బుద్ధిమంతుడు, అందాల రాముడు, గోరంత దీపం, ముత్యాల ముగ్గు, సీతాకళ్యాణం, సంపూర్ణ రామాయణం, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం లాంటి మంచి సినిమాలు ఆయన ఖాతాలో పడ్డాయి.

అణువణువూ హాస్యమే!

హాస్య రచయితగా ముళ్లపూడిది తిరుగులేని ముద్ర. ఆయన కలం నుంచి జాలువారే ప్రతి అక్షరమూ హాస్యాన్ని ఒలికించేది. ఆయన రచనల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘బుడుగు’ గురించి. ఆంధ్రపత్రికలో ‘బుడుగు చిచ్చరపిడుగు’ పేరుతో ముళ్లపూడి రాసిన సీరియల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బుడుగు పాత్ర అందరికీ ఫేవరేట్ అయ్యింది. ముళ్లపూడిని చిన్నప్పుడు ‘బుడుగు’ అని పిలిచేవారట. అందుకే ఆ పాత్రని అంత గొప్పగా తీర్చిదిద్ది ఉంటారేమో. ‘ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. అసలు పేరు ఇంకోటుంది. ఇప్పుడు చెప్పడానికి టైమ్ లేదు, అది చాలా పొడుగు. కావాలంటే మా నాన్నని అడుగు’ అంటూ ఆ పాత్ర తనను తాను పరిచయం చేసుకుంటుంది. ఈ ఓపెనింగ్‌కే  పాఠకులు ఇంప్రెస్ అయిపోయారు. ఇక లోతుగా చదివేకొద్దీ బుడుగుని అమితంగా ప్రేమించడం మొదలుపెట్టారు.  ‘రుణానందలహరి’ కూడా తెలుగు పాఠకుల మనసు దోచుకుంది. ముళ్లపూడిలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్‌‌కి నిలువెత్తు నిదర్శనం ఈ పుస్తకం. ఇందులోని ప్రతి పదంలో రుణం ఉంటుంది. ‘రుణ కిరణాలతో లోకాన్ని జోకొడుతున్న చంద్రుడు అ‘రుణ’ కిరణుడు.. కనుచూపు మేరలో కానగారాగే తెల్లబోయి పాలిపోయాడు’ అంటూ మొదలవుతుంది. ఇక లోపలికి వెళ్లేకొద్దీ అడుగడుగునా ఆశ్చర్యపర్చే పద ప్రయోగాలే. ‘కాకులు కావులిస్తాయి’ట. చీమలు చిమ చిమ నవ్వుతాయట. ఆడచీమ అయితే చీమంతి అట, మగ చీమయితే చీమంతుడట.  అప్పులు చేసేటప్పుడు ఉండే వాతావరణాన్ని వర్ణిస్తూ ‘రుణగుణ ధ్వని’ అంటారు. టోకరా ఇవ్వడమే వృత్తిగా పెట్టుకోవడాన్ని టోకరేజీ అని చెబుతారు. మొత్తంగా ఈ పుస్తకాన్ని తన చతురోక్తులతో నింపేశారు ముళ్లపూడి. ఇంకా గిరీశం లెక్చర్లు, రాజకీయ బేతాళ పంచవింశతి అంటూ చాలానే రచనలు చేశారు. ఆ రచనలన్నింటినీ ఓ ప్రముఖ పబ్లిషింగ్ హౌస్‌వారు ‘కథా రమణీయం’ పేరుతో ఎనిమిది సంపుటాలుగా ప్రింట్ చేశారు. 

మూలాలు మర్చిపోలేదు

చెన్నైలో పెరిగి, అక్కడే సెటిలైనా తన మూలాల్ని ఎప్పుడూ మర్చిపోలేదు ముళ్లపూడి. తాను పుట్టిన గోదావరి ప్రాంతమంటే ఆయనకు ప్రాణం. అందుకే ఆయన రచనలన్నీ గోదావరి మాండలికంలోనే ఉండేవి. పాత్రలన్నీ గోదావరి యాసే మాట్లాడేవి. ఆ ప్రాంతంలో చూసిన వ్యక్తులే ఆయన రచనల్లో పాత్రలయ్యేవి. సినీ రచన చేయడానికి ఒక లాంచి మాట్లాడుకుని భద్రాచలం బయలుదేరేవారు వెంకట రమణ. భద్రాద్రి చేరేలోపు స్క్రిప్ట్ పూర్తి చేసేసేవారు. బాపుతో కలిసి చేసిన సినిమాలన్నీ కూడా గోదావరి చుట్టుపక్కల తీసినవే. అందుకే ముళ్లపూడి ఎప్పుడూ అనేవారు.. ‘గోదావరి మా ఫిల్మ్ స్టూడియో’ అని.

కీర్తి కిరీటాలు

రచయితగా ముళ్లపూడి సంపాదించిన కీర్తిని ఏవో కొద్ది మాటల్లో వర్ణించడం కష్టం. ఆయన జీవితంలోని ప్రతి మజిలీని, ప్రతి గెలుపుని తెలుసుకోవాలంటే ఆయన ఆత్మకథ చదవాల్సిందే. తన ఆటోబయోగ్రఫీని కోతి కొమ్మచ్చి, ఇంకోతి కొమ్మచ్చి, ముక్కోతి కొమ్మచ్చి పేర్లతో మూడు వాల్యూమ్స్ గా  ముళ్లపూడి ప్రచురించారు.  ఇవి పుస్తకాలుగానే కాదు, ఆడియో రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా తన జీవితం గురించి ముళ్లపూడి మాటల్లోనే తెలుసుకోవచ్చు. జర్నలిస్టుగా, కథకుడిగా, ఫిల్మ్ క్రిటిక్‌గా, కథా రచయితగా, డైలాగ్ రైటర్‌‌గా.. ఎన్నో విధాలుగా కీర్తి గడించారు ముళ్లపూడి. ఆరుసార్లు నంది అవార్డును అందుకున్నారు. రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని పొందారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చారు. ఇంకా ఎన్నో పురస్కారాలు, సత్కారాలు ఆయన కీర్తికి తార్కాణాలుగా నిలిచాయి. 

బాపు, రమణల అమర స్నేహం

ముళ్లపూడి వెంకటరమణ పేరు చెప్పగానే ఠక్కున బాపు పేరు నోటివెంట వచ్చేస్తుంది. ఎందుకంటే బాపు, రమణల శరీరాలే వేరు. ఆత్మ ఒక్కటే. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. 1942లో మొదటిసారి మద్రాసులో స్కూల్లో కలుసుకున్నారు. ఐదు, ఆరు తరగతుల నుంచి ఇద్దరూ కలిసే చదివారు. కలిసే తిరిగారు. కలిసే ఎదిగారు. కడవరకు కలిసే ప్రయాణించారు. ఈయన అక్షరానికి ఆయన చిత్రం తోడయితే తిరుగే ఉండేది కాదు. బాపు ‘సాక్షి’ అనే సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. అప్పటికే ముళ్లపూడి బిజీ రచయిత. స్నేహితుడి తొలి చిత్రానికి కూడా ఆయనే రచన చేశారు. సినిమా సూపర్‌‌ హిట్. ఆ తర్వాత సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, రాధాకళ్యాణం, గోరంతదీపం, ముత్యాల ముగ్గు, మంత్రిగారి వియ్యంకుడు, పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం, రాధా గోపాళం, సుందరకాండ లాంటి ఎన్నో సినిమాలకి ఇద్దరూ కలిసి వర్క్ చేశారు. వాళ్ల కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు భారీగా ఉండేవి. బాపు ఆలోచనలకు అందమైన అక్షర రూపం ఇవ్వడంలో నూరుశాతం సక్సెస్ అయ్యేవారు రమణ. ఇద్దరూ కలిసే సినిమాలు నిర్మించారు. కొన్ని తమిళ, హిందీ చిత్రాలకీ వీరు వర్క్ చేశారు. సినిమాలకే కాదు.. టెలివిజన్‌ కు కూడా పని చేశారు. ఎన్టీఆర్ హయాంలో చిన్నపిల్లల కోసం స్కూల్ సబ్జెక్ట్స్ మీద వీడియోలు చేశారు. అవి దూరదర్శన్‌లో చాలా పాపులర్. భాగవతం, శ్రీ వెంకటేశ్వర వైభవం లాంటి మైథాలజీ సీరియల్స్ను కూడా తెరకెక్కించారు. వీరిద్దరూ కలిసి చేసిన చివరి ప్రాజెక్ట్  ‘శ్రీరామరాజ్యం’. ప్రొఫెషనల్‌గానూ, వ్యక్తిగతంగానూ వీరి ఆలోచనలు ఒకటే. అలాగే బతికారు. చివరి వరకు మంచి స్నేహితులుగానే మెలిగారు. 2011 ఫిబ్రవరి 24న ముళ్లపూడి కన్ను మూసే సమయంలో కూడా బాపు పక్కనే ఉన్నారు. ఆ తర్వాత మూడేళ్లకు ఆయన కూడా తుదిశ్వాస విడిచి స్వర్గంలోని తన ప్రాణ స్నేహితుడి దగ్గరకు చేరుకున్నారు. ఓ రచయితగా, మంచి వ్యక్తిగా, గొప్ప స్నేహితుడిగా.. ప్రతి విషయంలోనూ ఒక సంపూర్ణమైన మనిషిగా తన ప్రత్యేకతను ముళ్లపూడి చాటుకున్నారు. అందుకే ఆయన సాహితీ సినీ రంగాల్లోనే కాదు.. ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎప్పటికీ నిలిచే ఉంటారు.