
జీవీకే నుంచి 50.5 శాతం వాటాకొంటోన్న ఏఈఎల్
అతిపెద్ద రెండో ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌గా ఏఈఎల్
మైనార్టీ పార్టనర్ల నుంచి మరో 23.5 శాతం
డీల్ వాల్యు రూ.15 వేల కోట్లు
న్యూఢిల్లీ: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(ఎంఐఏఎల్)లో అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్(ఏఈఎల్) త్వరలోనే 74 శాతం వాటాను కొనుగోలు చేయబోతోంది. ఈ కొనుగోలుతో జీఎంఆర్ గ్రూప్ తర్వాత దేశంలో ఎయిర్‌పోర్టులను నిర్వహించే అతి పెద్ద ప్రైవేట్ ఆపరేటర్‌గా అదానీ గ్రూప్ నిలువనుంది. వచ్చే వారంలోగా జీవీకే గ్రూప్ నుంచి 50.5 శాతం వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తుందని ఒక బిజినెస్ వెబ్‌సైట్ రిపోర్ట్ చేసింది. అంతేకాక మైనార్టీ పార్టనర్ల నుంచి మరో 23.5 శాతం వాటాను గౌతమ్ అదానీకి చెందిన ఏఈఎల్ కొనుగోలు చేస్తుందని పేర్కొంది. ఎయిర్‌పోర్టుల నిర్వహణ కంపెనీలు సౌత్ ఆఫ్రికా(ఏసీఎస్‌ఏ), బిడ్‌వెస్ట్ గ్రూప్‌లకు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్లో 10 శాతం, 13.5 శాతం వాటాలున్నాయి. ఈ కొనుగోలు కోసం అదానీ గ్రూప్ కనీసం రూ.15 వేల కోట్లు చెల్లించనుందని తెలుస్తోంది. ఈ కొనుగోలు ద్వారా త్వరలోనే రాబోతున్న నవీ ముంబై ఎయిర్‌పోర్టులో గ్రూప్ ఓనర్‌షిప్‌ను కూడా అదానీ పొందనుంది. దీనిలో 74 శాతం వాటా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కు ఉంది. అదానీ గ్రూప్ వాటాల కొనుగోలుతో గత కొంత కాలంగా జీవీకే గ్రూప్‌కు, మైనార్టీ పార్టనర్లకు మధ్య నెలకొన్న లీగల్ వివాదాలకు కూడా ఫుల్స్టాప్ పెట్టినట్టు అవుతుంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అప్పులు తిరిగి చెల్లించే గడువు దగ్గరపడుతుండటంతో లెండర్ల నుంచి జీవీకే గ్రూప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. జీవీకే గ్రూప్ లిక్విడిటీ పొజిషన్ చాలా బలహీనంగా ఉందని లెండర్లు భావిస్తున్నారు. కరోనా మహమ్మారితో ఎయిర్‌పోర్ట్ వ్యాపారాలు బాగా దెబ్బతినడంతో అప్పులను తిరిగి చెల్లించడం జీవీకే గ్రూప్‌కు కష్టంగా మారింది. ఈ ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్కరికీ పాజిటివ్‌గా నిలువనుందని ఒక బ్యాంకర్ అన్నట్టు తెలిసింది. కాగా, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ది చేసే క్రమంలో జీవీకే గ్రూప్ రూ.705 కోట్ల స్కాం చేసినట్టు ఇటీవలే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో జీవీకే గ్రూప్ ఛైర్మన్ జీవీ కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్‌రెడ్డిలపై సీబీఐ చీటింగ్ కేసు కూడా నమోదు చేసింది. ఆ తర్వాత మనీలాండరింగ్ జరిగిందంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి, నిర్వహణకోసం 2006లో జీవీకేతో ఏఏఐ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా జీవీకే గ్రూప్ బోగస్ వర్క్ కాంట్రాక్టులు, రిజర్వ్ ఫండ్ దుర్వినియోగం చేయడం, ఖర్చు అంచనాలను పెంచడం వంటి వాటికి పాల్పడిందని సీబీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం జీవీకే చేతిలో ఉన్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వాటాలనే అదానీ గ్రూప్ కొంటోంది.
ఇటీవలే అదానీ చేతికి ఆరు ఎయిర్‌పోర్ట్‌లు…
ఇటీవలే ఆరు ఎయిర్‌పోర్ట్‌లను అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, తిరువనంతపురం, గౌహతిలలోని ఎయిర్‌పోర్ట్‌ల కంట్రోల్‌ను గౌతమ్ అదానీకి చెందిన ఏఈఎల్ దక్కించుకుంది. పబ్లిక్ ప్రైవేట్
పార్టనర్‌షిప్ విధానంలో ఆరు ఎయిర్‌పోర్ట్‌లను ఆపరేషన్, మెయింట్నెన్స్ చేయడానికి, డెవలప్ చేయడానికి పూర్తి హక్కులు అదానీ గ్రూప్‌కు కేంద్రం ఇచ్చింది. తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రైవేటైజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తిరిగి పరిశీలించాలని
కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అయితే 50 ఏళ్ల వరకు మాత్రమే అదానీకి లీజ్‌కు ఇచ్చామని, మళ్లీ ఆ ఎయిర్‌పోర్ట్‌లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు వచ్చేస్తాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ క్లారిటీ ఇచ్చారు. రెవెన్యూ షేరింగ్ బేసిస్‌లో రీడెవలప్‌మెంట్ కోసం ఈ ఎయిర్‌పోర్ట్‌లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్‌ను కూడా ప్రైవేట్ డెవలపర్ అభివృద్ధి చేయనున్నారు.
అదానీ గ్రూప్ షేర్లు ర్యాలీ…
ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ లో జీవీకే వాటా కొనుగోలు వార్తలతో అదానీ ఎంటర్‌ప్రైజస్ షేరు సోమవారం సెషన్‌లో 6.71 శాతం పెరిగి రూ. 249 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ. 253.85 స్థాయిని తాకింది. అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ గ్రీన్, అదానీ గ్యాస్ కంపెనీల షేర్లు కూడా సోమవారం సెషన్‌లో పెరిగాయి.
For More News..