మాజీ సీఎం ఇంట్లో.. 4 అడుగుల నాగు పాము

 మాజీ సీఎం ఇంట్లో.. 4 అడుగుల నాగు పాము

శివసేన (యూబీటీ) అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ముంబై నివాసంలో నాలుగు అడుగుల పొడవైన పాము కనిపించింది. ఆగస్టు 6న ఈ సంఘటనతో అక్కడి వాతావరణంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే, ఈ విషపూరిత కోబ్రా జాతికి చెందిన పామును ట్రాప్ చేసేందుకు శివసైనికులు వన్యప్రాణుల రక్షణ, రెస్క్యూ బృందాన్ని పిలిపించారు.

కలానగర్ బాంద్రా ఈస్ట్‌లోని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ముంబై నివాసం 'మాతోశ్రీ' ఆవరణలో ఈ పాము కనిపించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం అందుకున్న వైల్డ్‌లైఫ్ యానిమల్ ప్రొటెక్షన్ అండ్ రెస్క్యూ గ్రూప్ నాలుగు అడుగుల పొడవున్న పామును బంధించి అడవిలోకి వదిలేసింది. ఈ పాము విషపూరితమైన పాము అని వారు చెప్పారు.  

దీనికి సంబంధించిన వీడియోలో ఓ వ్యక్తి పామును చేత్తో పట్టుకుని కనిపిస్తున్నాడు. ఆ పాము పారిపోవడానికి ప్రయత్నిస్తున్నా.. ఒకచేత్తో కర్రతో కంట్రోల్ చేస్తూ.. మరో చేత్తో పామును పట్టుకుని తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.