
- హైదరాబాద్‌కు 202వ ర్యాంకు
- హాంగ్‌కాంగ్‌కు మొదటి ర్యాంకు
- వెల్లడించిన మెర్సర్స్ సర్వే
న్యూఢిల్లీ: మనదేశానికి వచ్చే విదేశీయులకు కూడా ముంబై అత్యంత ఖరీదైన నగరమని వెల్లడయింది. తరువాతి ప్లేస్‌లో ఢిల్లీ ఉంది. ఈ నగరాల్లో జీవన వ్యయం చాలా ఎక్కువగా ఉంది. మెర్సర్స్ నిర్వహించిన స్టడీ ఈ విషయాలను వెల్లడి చేసింది. దీనికోసం ఐదు ఖండాల్లోని 227 సిటీల నుంచి సమాచారం తీసుకున్నారు. సర్వేలో ముంబైకి గ్లోబల్‌గా 147వ ర్యాంకు వచ్చింది. హాంగ్‌కాంగ్ సిటీకి మొదటిర్యాంకు వచ్చింది. గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఢిల్లీ (169), చెన్నై (184), బెంగళూరు (189), హైదరాబాద్ (202), కోల్‌కతా (211), పూణె (213) స్థానాల్లో ఉన్నాయి. ఈ నగరాల్లో ఇండ్లు, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం సహా 200 కంటే ఎక్కువ వస్తువుల ధరలను పోల్చడం ద్వారా ర్యాంకులు ఇచ్చారు. పండ్లు, కూరగాయలు, పాలు, డెయిరీ ప్రొడక్టుల ధరలు అన్ని ఈ నగరాల్లో పెరిగాయి. బడ్జెట్సిటీల్లో కోల్‌కతా, పూణేలకు మొదటి, రెండు ర్యాంకులు వచ్చాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో మద్యం ధరలు పెరిగాయి, ఈ విభాగంలో చెన్నైలో అత్యధిక ధరలు ఉన్నాయి. అన్ని నగరాల్లో వ్యక్తిగత సంరక్షణ ఖర్చులు పెరిగాయి. ముంబై అత్యంత ఖరీదైనది కాగా, కోల్‌కతాలో సేవల ఖరీదు తక్కువగా ఉంది. చాలా భారతీయ నగరాల్లో కరెంటు, ఇంటర్నెట్/బ్రాడ్‌బ్యాండ్ వంటి యుటిలిటీల బిల్స్ పెరిగాయి. ఢిల్లీ, ముంబైలలో తిండి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఈ విషయంలో పూణే బెస్ట్ అని తేలగా, తర్వాత స్థానాల్లో బెంగళూరు, హైదరాబాద్ ఉన్నాయి.
ఉద్యోగులకు ఈ నగరాల్లో కష్టమే..
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అంతర్జాతీయ ఉద్యోగులకు హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్లు అత్యంత ఖరీదైన నగరాలని వెల్లడయింది. అత్యంత ఖరీదైన లొకేషన్లలో హవానా ర్యాంకింగ్ 83 స్థానాలు పడిపోయింది. కరెన్సీ విలువ తగ్గిన కారణంగా, పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్‌ల ర్యాంకులు కూడా తగ్గాయి. భారతీయ నగరాల్లో ముంబై కంటే-- చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పూణేలో వసతి ఖర్చులు 50 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. "ప్రపంచ ర్యాంకింగ్‌లో భారతీయ నగరాల ర్యాంకులు మారాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. కరెన్సీ విలువ తగ్గుదల వల్ల ఐరోపా వంటి ఇతర ప్రాంతాలలో వస్తువులు, సేవల ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ భారతీయ నగరాల ర్యాంకింగ్‌లను తగ్గించడంలో పాత్ర పోషించాయి" అని మెర్సర్ ఇండియా మొబిలిటీ లీడర్ రాహుల్ శర్మ అన్నారు. ముంబై, ఢిల్లీ వంటి భారతీయ నగరాల్లో తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయడానికి మల్టీ నేషనల్ కంపెనీలు (ఎంఎన్‌సీలు) ఇష్టపడుతున్నాయి. విదేశాల్లోని ఇతర నగరాలతో పోలిస్తే భారతీయ మెట్రో నగరాల్లో నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉండటమే కారణం. షాంఘై, బీజింగ్, టోక్యో వంటి ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రధాన నగరాలతో పోల్చినా మన దగ్గరే అద్దెలు తక్కువగా ఉన్నాయి. ఆసియాలోని టాప్–35 నగరాల్లో ముంబై, ఢిల్లీకి చోటు దక్కింది.