వరవరరావు పిటిషన్ తిరస్కరించిన ఎన్ఐఏ కోర్టు

వరవరరావు పిటిషన్ తిరస్కరించిన ఎన్ఐఏ కోర్టు

ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి  వరవరరావు కేటరాక్ట్ సర్జరీ కోసం మూడు నెలల పాటు హైదరాబాద్ కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది. వచ్చే మూడు నెలల్లో ఎల్గార్ పరిషత్ కేసులో అభియోగాల నిరూపణకు సంబంధించిన కీలక ప్రక్రియ జరగనున్నందున హైదరాబాద్ కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ వరవరరావును మూడు నెలల పాటు హైదరాబాద్ కు వెళ్లేందుకు అనుమతిస్తే , అభియోగాల నిరూపణకు సంబంధించిన ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.

2022 ఆగస్టు 10నే సుప్రీంకోర్టు బెయిల్

వాస్తవానికి ఈ కేసులో వరవరరావుకు 2022 ఆగస్టు 10నే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ముంబై దాటి వెళ్లొద్దని నిర్దేశించింది. బెయిల్ నిబంధనల్లో  ఏవైనా సడలింపులు కావాలంటే  స్పెషల్ ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో ఆ కోర్టును ఆశ్రయించిన వరవరరావు.. ముంబైలో అయితే కేటరాక్ట్ ఆపరేషన్ కు భారీగా ఖర్చవుతుందని తెలిపారు. ఈ శస్త్రచికిత్సను హైదరాబాద్ లో ఉచితంగా చేయించుకోవచ్చని, అక్కడ తన బాగోగులను దగ్గరుండి చూసుకునేందుకు పిల్లలు కూడా ఉంటారన్నారు. ఈమేరకు వరవరరావు తరఫు న్యాయవాది నీరజ్ యాదవ్ వాదనలు వినిపించారు.  ఎన్ఐఏ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకాశ్ శెట్టి ప్రతివాదనలు వినిపిస్తూ.. కంటి సర్జరీని చేయించుకోవడానికి ముంబై వదిలి హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ముంబైలోనే సర్జరీ చేయించుకొని రీయింబర్స్మెంటుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ వాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు హైదరాబాద్ కు వెళ్లి మూడు నెలలు చికిత్సపొందేందుకు అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

ఏమిటీ కేసు ? 

2017 డిసెంబరు 31న పూణేలో ఎల్గార్ పరిషత్ మీటింగ్ జరిగింది. ఆ కార్యక్రమంలో వరవరరావుతో పాటు పలువురు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మీటింగ్ జరిగిన తర్వాతి రోజే భీమా కోరెగావ్ మెమోరియల్ వద్ద హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పూణే పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూలగొట్టే అంశంపై ఇందులో చర్చ జరిగిందన్నారు. ఈ విచారణలో విప్లవ కవి వరవరరావు పేరు కూడా బయటకు వచ్చింది. దీంతో ఆయనను 2018 ఆగస్టు 28న అరెస్టు చేశారు.