కాలుష్యంలో ముంబై రికార్డు.. ఢిల్లీని కూడా వెనక్కి నెట్టేసింది

కాలుష్యంలో ముంబై రికార్డు.. ఢిల్లీని కూడా వెనక్కి నెట్టేసింది

ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో ముంబై టాప్ 2కు చేరింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8వ తేదీల మధ్య ఎయిర్ క్వాలిటీ ఆధారంగా స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ ఈ విషయం స్పష్టం చేసింది. జనవరి 29న ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ముంబై..  ఫిబ్రవరి 2న ప్రపంచంలోనే రెండో అత్యంత కాలుష్య నగరంగా మారింది. ఆ తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడినా.. ఫిబ్రవరి 8న మళ్లీ రెండో స్థానానికి చేరింది. ఫిబ్రవరి 13న మూడో స్థానంలో నిలిచింది. 

వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా గాలి నాణ్యత పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు. చలి కాలం కావడం, నిర్మాణ వ్యర్థాలు కూడా పరిస్థితికి కారణమని అంటున్నారు. గాలి వేగం నెమ్మదించడం వల్ల కూడా ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని నిపుణులు వెల్లడించారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ సర్వే చేపట్టారు. ఇదిలా ఉంటే.. గాలి నాణ్యత పడిపోవడంతో కొద్ది రోజుల పాటు నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు ముంబై ప్రకటించింది.