
- మున్సిపల్, జీపీ కార్మికుల జీతాల్లో భారీ తేడా
- అది కూడా నాలుగైదు నెలలకు ఒకసారి ఇస్తున్నరు
- డిమాండ్ల సాధన కోసం జూన్ 25 నుంచి సమ్మె!
- జూన్ 5న సమ్మె నోటీసు ఇస్తమంటున్న సంఘాలు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం కనీస వేతనం కూడా ఇవ్వకుండా తమతో రోజుకు 12 గంటలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నదని గ్రామ పంచాయతీ(జీపీ) కార్మికులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో పీఆర్సీ కమిషన్ నిర్ధారించిన రూ.19 వేల కనీస వేతనానికి, ప్రస్తుతం తమకు ఇస్తున్న జీతానికి పొంతన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు కార్మికుల నెల వేతనం రూ.8 వేలు ఉండగా, మే డే సందర్భంగా మరో రూ.1,000 పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రామ పంచాయతీల దగ్గర నిధులు లేకపోవడం, శాంక్షన్అయిన ఫండ్స్‌ను ప్రభుత్వం ఫ్రీజ్ చేస్తుండటంతో ఆ అరకొర జీతం కూడా నాలుగైదు నెలలకు ఓసారి చెల్లిస్తున్నారని వాపోయారు.
ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న రూ.26 వేల వేతనం, కార్మికుల రెగ్యులరైజేషన్ అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటున్నారు. సర్కార్ ఇకనైనా తమ సమస్యలు తీర్చకపోతే వచ్చే నెల 25 నుంచి సమ్మెకు వెళ్తామని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఇందుకోసం వచ్చే నెల 5న పంచాయతీ రాజ్ కమిషనర్ కు సమ్మె నోటీసు ఇవ్వాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ), ఇతర సంఘాలు నిర్ణయించాయి. సమ్మె సన్నాహకాల్లో భాగంగా వచ్చే నెల 12న కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు పిలుపునిచ్చాయి.
పని 12 గంటలు.. ఇస్తున్నది రూ.300
పీఆర్సీ కమిషన్ సిఫార్సు ప్రకారం రాష్ట్రంలో కనీస వేతనం రూ.19 వేలు ఉండాలని సూచించింది. అయితే ఇందుకు విరుద్ధంగా జీపీ కార్మికులకు రూ.9 వేలే ఇస్తుండటంపై కార్మికులు మండిపడుతున్నారు. డైలీ కూలికి వెళితే రూ.700 ఇస్తున్నారని, అలాంటప్పుడు రోజుకు 12 గంటల పాటు పనిచేస్తున్న తమకు రోజు వారీ వేతనం రూ.300 వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
11 వేల కార్మికుల కొరత
రాష్ట్రంలో గతంలో 8,500 గ్రామ పంచాయతీలుగా ఉండగా తెలంగాణ ఆవిర్భావం తరువాత 500 జనాభా ఉన్న తండాలను, పెద్ద గ్రామ పంచాయతీలను విడదీసి సుమారు 4,500 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. గ్రామ పంచాయతీల సంఖ్య ప్రస్తుతం 12,769కి చేరింది. పంచాయతీల్లో కార్మికులు 47వేల మంది పనిచేస్తున్నారు. అయితే కొత్త గ్రామ పంచాయతీల్లో మాత్రం కార్మికులను నియమించలేదు. కొత్త గ్రామ పంచాయతీలకు మరో 11వేల మంది కార్మికులు అవసరం అని యూనియన్ నేతలు చెబుతున్నారు. సిబ్బంది నియామకాలు చేపట్టాలని ఎంతో కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవటం లేదని కార్మికులు గుర్తు చేస్తున్నారు.
ఒక్కో దగ్గర ఒక్కో విధంగా జీతాలు
రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జీపీలలో కార్మికులకు జీతాలు ఒకే రకంగా అందటం లేదు. కార్పొరేషన్లలో రూ.18 వేలు ,మున్సిపాలిటీల్లో రూ.16,800 ఇస్తుండగా జీపీల్లో మాత్రం రూ.8500 మాత్రమే ఇస్తున్నారు. అందరూ చేసే పని ఒకటే అయినపుడు జీతాలలో ఇంత భారీ వ్యత్యాసం ఎందుకని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
90 శాతం మంది బడుగు వర్గాల వారే
జీపీ కార్మికుల్లో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. ఏండ్లుగా పనిచేస్తున్నా తమను రెగ్యులరైజ్ చేయటం లేదని వాపోతున్నారు. తెలంగాణ వచ్చాక కార్మికులను మరింత ఇబ్బంది పెడుతూ మల్టీ పర్పస్ విధానాన్ని సర్కారు తీసుకొచ్చింది. ఏ పని చెప్పినా చేయాలని జీవో ఇచ్చిందని కార్మికులు వాపోతున్నారు. పంచాయతీల్లో శానిటేషన్ వర్కర్స్, వాటర్ మెన్, పంప్ అపరేటర్, కారోబార్, ఎలక్ట్రీషియన్...ఇలా వివిధ రకాలుగా కార్మికులు పనిచేస్తున్నారు.
కేసీఆర్ మోసం చేసిండు..
సఫాయన్నా సలాం అంటూ మభ్యపెడుతూ సీఎం కేసీఆర్ కార్మికులతో రాత్రింబవళ్లు వెట్టిచాకిరి చేయిస్తున్నడు. వేతనాలు పెరుగుతాయని ఆశిస్తే.. కేవలం రూ.1,000 పెంచి మోసగించిండు. జీపీలకు అవార్డుల పంట పండిందని గొప్పలు చెప్పుకునే కేటీఆర్ సఫాయి కార్మికుల శ్రమ ఫలితంగా అవి వచ్చాయనే సంగతి మర్చిపోతున్నరు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఎన్నో ఏండ్లుగా కోరుతున్నా పాలకులు స్పందించడం లేదు.
–శ్రీనివాస్, జీపీ కార్మికుడు, నాగర్ కర్నూలు
జీవో 51 రద్దు చేసి.. సమాన వేతనం ఇయ్యాలె
2019లో కార్మికులకు సంబంధించి ఇచ్చిన జీవో నంబర్ 51 రద్దు చేయాలి. మున్సిపల్ కార్మికులతో సమానంగా జీపీ కార్మికులకు జీతాలు ఇవ్వాలి. జీతాలు సరిగా రాక ఇటీవల కామారెడ్డి జిల్లాలో ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నడు. జీపీలో నలుగురు కార్మికుల జీతం 8 మందికి ఇస్తున్నరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి. లేదంటే వచ్చే నెలలో సమ్మెకు వెళ్తం.
–చాగంటి వెంకటయ్య, పత్తిపాక, నెక్కొండ, మహబూబాబాద్ జిల్లా