అక్రమ వెంచర్లు... పట్టించుకోని మున్సిపల్ అధికారులు

అక్రమ వెంచర్లు... పట్టించుకోని మున్సిపల్ అధికారులు
  • కొత్త జిల్లాల్లో విచ్చలవిడిగా నాన్‌‌‌‌‌‌‌‌ లే అవుట్‌‌‌‌‌‌‌‌ వెంచర్లు
  • పార్కులు, రోడ్లు, డ్రైనేజీలకు జాగా తీయకుండానే అమ్మకాలు  
  • అధికార పార్టీ లీడర్ల అండదండలు కొని మోసపోతున్న జనాలు 
  • ఇండ్లు కట్టుకోవడానికి పోతే ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పేరిట వసూళ్లు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : సొంత ప్లాట్లలో ఇంటి పర్మిషన్​ కోసం వెళ్లిన సామాన్యుల నుంచి సవాలక్ష నిబంధనల పేరుతో లక్షలకు లక్షలు ఫీజులు కట్టించుకుంటున్న ఆఫీసర్లు..అక్రమ వెంచర్లను మాత్రం చూసిచూడనట్లు వదిలేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లా కేంద్రాల పరిధిలో కొన్నేండ్లుగా రియల్​ ఎస్టేట్​వ్యాపారం జోరందుకుంది. రియల్టర్లు ఎలాంటి  డీటీసీపీ పర్మిషన్​లేకుండా, పార్కులకు 10 శాతం వదలకుండా, కనీసం నాలా కన్వర్షన్​ తీసుకోకుండా వెంచర్లు చేసి అమాయకులకు అంటగడుతున్నారు. గతంలో చాలామంది ఇలా కొన్న ప్లాట్లకు ఇంటి పర్మిషన్​ తీసుకుందామని వెళ్తే ఎల్ఆర్ఎస్​కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొత్త మున్సిపల్​చట్టం అమల్లోకి వచ్చాక చేస్తున్న లే అవుట్లు సైతం రూల్స్​కు విరుద్ధంగా ఉంటుండడంతో తెలియక కొంటున్నవారు కష్టాలు పడుతున్నారు. చాలాచోట్ల ఏర్పాటు చేస్తున్న రియల్​ వెంచర్లలో రూలింగ్​ పార్టీ లీడర్లే పార్ట్​నర్లుగా ఉంటుండడంతో చర్యలు తీసుకునేందుకు ఆఫీసర్లు జంకుతున్నారు.  

ఇవీ నిబంధనలు

వ్యవసాయ భూమిని రియల్​ఎస్టేట్​వెంచర్‌‌‌‌‌‌‌‌లా మార్చి ఇండ్ల స్థలాలుగా అమ్మాలంటే ఎకరానికి రూ.1.15 లక్షల చొప్పున ప్రభుత్వానికి చెల్లించి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ నుంచి పర్మిషన్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలి. తర్వాత‌‌‌‌ వెంచర్‌‌‌‌‌‌‌‌లోని మొత్తం ప్లాట్లలో 15 శాతం మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్​పేరు మీద మార్టిగేజ్​చేయాలి. 10 శాతం భూమిని పార్క్‌‌‌‌‌‌‌‌ కోసం కేటాయించాలి. కావాల్సిన కరెంట్‌‌‌‌‌‌‌‌ స్తంభాలు పాతి, మురుగు కాల్వలు తవ్వించి, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ తర్వాతే ఈ ప్లాట్లను కమిషనర్​నుంచి వెంచర్​యజమానులకు తిరిగి వస్తాయి. కానీ, కొందరు రియల్టర్లు ఇప్పటికీ నాన్‌‌‌‌‌‌‌‌ లే అవుట్‌‌‌‌‌‌‌‌ ప్లాట్లను అమ్మేస్తున్నారు. అందుబాటులో ఉన్న వ్యవసాయ భూములు కొని, అందులో రోడ్డు కోసం కొంత జాగ తీసి, మొరం పోసి హద్దురాళ్లు పాతి, వీటినే ప్లాట్లుగా ప్రచారం చేసి గజాల లెక్కన ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ స్కీం కింద డబ్బులు కట్టించి తామే మున్సిపాలిటీ‌‌‌‌ నుంచి అన్ని పర్మిషన్లు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు. ప్లాట్లన్నీ అమ్ముడుపోయాక రోడ్లు, ఖాళీ జాగాలను కూడా ప్లాట్ల కింద చూపి అమ్ముకుంటున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా రూలింగ్​పార్టీకి చెందిన లీడర్ల వెంచర్లు కావడంతో పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్లాట్లు కొన్నవాళ్ల మధ్య పంచాయితీలు మొదలై ఠాణా మెట్లు ఎక్కుతున్నారు. జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రతి వారం ఐదు నుంచి  పది వరకు కంప్లయింట్స్ రియల్​ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ మోసాలకు సంబంధించినవే ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.

సామాన్యులకు లక్షల్లో ఫైన్లు

 రాష్ట్రంలో 2016 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో జిల్లాల పునర్విభజన జరిగింది. తర్వాత కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. దీంతో కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ, ఇతర జిల్లాస్థాయి ఆఫీసులు, కొత్త హాస్పిటళ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవే, ఆర్‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ రోడ్ల వెంబడి వ్యవసాయ భూములన్నీ రియల్​ఎస్టేట్​వెంచర్లుగా మారిపోయాయి. అయితే, వీటిలో సగం వెంచర్లకు ప్రభుత్వ అనుమతులుంటే మిగతా సగానికి ఎలాంటి అనుమతులు లేవు. ఈ దందా అంతా గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు తెలిసే జరుగుతున్నా లైట్ తీసుకుంటున్నారు. కేవలం బోర్డులు పెట్టి వదిలేస్తున్నారు. కొద్ది రోజులకే ఆ బోర్డులు పీకేస్తున్న రియల్టర్లు మళ్లీ యథావిధిగా ప్లాట్లు అమ్ముకుంటున్నారు. తర్వాత మున్సిపల్​ఆఫీసుకు పర్మిషన్​కోసం పోతే ప్లాట్లు కొన్నవారికి ఫైన్లు వేస్తూ వేధిస్తున్నారు. అనుమతిలేని వెంచర్లలో స్థలం కొన్నారని, అక్కడ పార్క్‌‌‌‌‌‌‌‌ కోసం స్థలం కేటాయించలేదని, రోడ్లకు స్థలం తీయలేదని, స్తంభాలు ఏర్పాటు చేయలేదని ఇలా కారణాలు చెబుతూ ల్యాండ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులరైజేషన్‌‌‌‌‌‌‌‌ స్కీం (ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌) పేరిట రూ.లక్షలకు లక్షలు ఫైన్లు వసూలు చేస్తున్నారు. అక్రమ లే అవుట్లు పెట్టి సామాన్యుల దగ్గర డబ్బులు తీసుకొని ఫ్లాట్లు అమ్మిన రియల్టర్లపై చర్యలు తీసుకోవడం లేదు.  

 అక్రమ వెంచర్లపై చర్యలేవీ?

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మొత్తం 26 వెంచర్లు ఉండగా, వీటిలో 13 వెంచర్లకు అనుమతులు లేవు. కలెక్టరేట్​చుట్టూ 57 ఎకరాల్లో అక్రమ వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముతున్నారు. దీనిపై ఇటీవల కొందరు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్​ఆఫీసర్లు వెళ్లి పరిశీలించగా అనుమతులు లేని విషయం బయటపడింది. ఎలాంటి పర్మిషన్ ​లేకుండా, సరైన రోడ్లు తీయకుండానే ప్లాట్ల పేరుతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ వెంచర్లన్నీ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి చెందిన ఓ ఎంపీపీ, ఆరుగురు కౌన్సిలర్లవి కావడంతో చర్యలకు వెనుకాడుతున్నారు. ఒకటి రెండు చోట్ల పర్మిషన్లు లేవంటూ బోర్డులు పెట్టి వచ్చేశారు. నిజానికి మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు అక్రమ వెంచర్లలోని హద్దురాళ్లను తొలగించి ఆయా యజమానులపై కేసులు పెట్టాల్సి ఉన్నా ఆ పని చేయడం లేదు.  

లక్ష రూపాలు ఖర్చయ్యింది 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓ వెంచర్ లో 200 గజాల స్థలం కొన్న. జి ప్లస్ వన్ పద్ధతిలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కోసం మున్సిపాలిటీలో అప్లై చేస్తే ఎల్ఆర్ ఎస్ ఇతర ఖర్చుల కోసం అదనంగా రూ. లక్ష కట్టాల్సి వచ్చింది. డబ్బులు తీసుకున్న తర్వాతనే ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చిన్రు. 
–  మాలాద్రి, భూపాలపల్లి టౌన్,  జయశంకర్ భూపాలపల్లి జిల్లా

చర్యలు తీసుకుంటాం

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 57 ఎకరాల్లో 13 అక్రమ వెంచర్లు ఉన్నట్టు గుర్తించాం. ఈ వెంచర్లలో ఇండ్ల స్థలాలు కొంటే ఇంటి నిర్మాణానికి పర్మిషన్​ రాదు. అక్రమ వెంచర్లు వేసే వారిపై చర్యలు తప్పవు. జిల్లా టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లి యాక్షన్​ తీసుకుంటాం.  
 ‒ సునిల్‌‌‌‌‌‌‌‌, టౌన్‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌,  భూపాలపల్లి మున్సిపాలిటీ