పిలిచి అవకాశం ఇస్తారన్న ఆలోచనలోనే ఉన్నా

పిలిచి అవకాశం ఇస్తారన్న ఆలోచనలోనే ఉన్నా

స్టార్​ హీరో, హీరోయిన్లు​ లేరు, భారీ సెట్స్​ కూడా లేవు. కమర్షియల్​ ఫార్మాట్​ సినిమాలు అంతకన్నా కాదు. అయితేనేం, చిన్న సినిమాలే పెద్దగా  కనిపించాయి. దానికి ఒక కారణం శేఖర్​ చంద్ర మ్యూజిక్​. గడిచిన పదేళ్లలో ఎన్నో చిన్న సినిమాలకి బ్లాక్​ బస్టర్​ ట్యూన్స్​ కట్టాడు ఈ మ్యుజీషియన్​. ‘నచ్చావులే’తో మొదలుపెట్టి ‘మనసారా’, ‘కార్తికేయ’, ‘సినిమా చూపిస్త మావ’ లాంటి మరెన్నో హిట్ ఆల్బమ్స్ ​ ఇచ్చాడు. రీసెంట్​గా ‘సవారి’తో ఆడియెన్స్​ని ట్యూన్ చేసిన శేఖర్​ చంద్ర ఇండస్ట్రీకి వచ్చి పదహారేండ్లు అయింది. కానీ, ఎన్ని హిట్​ పాటలకి బాణీలు కట్టినా పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదు ఇతనికి. ‘‘ఎందుకు’’? అని అడిగితే ‘ఇప్పటిదాకా నా దగ్గరికి వచ్చిన సినిమాలే చేశా’ను అన్నాడు.

సక్సెస్​కి షార్ట్​కట్​ హార్డ్​వర్క్​ ఒక్కటే..ఇదే నమ్మాడు శేఖర్​చంద్ర కూడా. అందుకే తనని తాను నిరూపించుకునే ప్రతి చిన్న​ అవకాశాన్ని పట్టుకున్నాడు. ఆ ప్రయత్నమే తనని 30 సినిమాల వరకు నడిపించింది. చిన్న సినిమాలకి పెద్ద మ్యూజిక్​ డైరెక్టర్​ని చేసింది. తనలాంటి వాళ్లెందరికో ఇన్​స్పిరేషన్​గా నిలబెట్టింది. ఇండస్ట్రీకి ఎన్నో ఆల్ టైం హిట్ సాంగ్స్ ఇచ్చిన శేఖర్​  ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఆ విశేషాలు అడిగితే ‘‘ఫ్యూచర్​లో​ అన్ని రకాల పాటలు కంపోజ్​ చేయాలనుకుంటున్నా.. మంచి సినిమాలకి ట్యూన్స్​ కట్టాలనుకుంటున్నా..’’ అంటూ ఇలా చెప్పుకొచ్చాడు. 

‘‘మా నాన్న  హరి అనుమోలు సినిమాటోగ్రాఫర్​. ‘నువ్వే నువ్వే’, ‘నువ్వే కావాలి’, ‘గమ్యం’,  ‘స్టూడెంట్​ నెంబర్​ వన్’​ లాంటి ఎన్నో హిట్ సినిమాలకి పనిచేశారాయన. దానివల్ల చిన్నప్పట్నించీ ఇండస్ట్రీపై ఒక అవగాహన ఉంది. కానీ, మ్యూజిక్​ గురించి ఆవగింజంతైనా తెలియదు నాకు. కాలేజీలో చేరే​ వరకు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు.. ఎందుకలా అంటే? మొదట్నించీ మ్యూజిక్​ ఆలోచనలు లేవు నా మైండ్​లో. అసలు ఏ గోల్​ లేకుండా తిరుగుతుండేవాడ్ని. స్కూల్​ అంటే జైలు ఫీలింగ్​ వచ్చేది నాకు. మ్యాథ్స్, సైన్స్​ అంటే తలనొప్పి మొదలయ్యేది. దాంతో అత్తెసరు​ మార్క్స్​ కోసం పడరాని పాట్లు పడేవాడ్ని. అవి చూసి ఇంట్లో వాళ్ల తిట్లు. వాటన్నింటి మధ్య కష్టపడి ఇంటర్​​ వరకు  చేరుకున్నా. ఆ టైంలో  ఏఆర్​ రెహ్మాన్, ఇళయరాజా ​ పాటలు చాలా ఇన్​స్పైర్​ చేశాయి. మైఖేల్​ జాక్సన్​ ఆల్బమ్స్​ మ్యూజిక్​పై మరింత ఆసక్తి పెంచాయి. దాంతో ఒక హాబీలా గిటార్​ క్లాస్​లో చేరా. అక్కడ నా సాంగ్​ కంపోజిషన్స్​ విని అంతా మెచ్చుకునేవాళ్లు. అవన్నీ చూసి మ్యూజిక్​ వైపు మరిన్ని అడుగులు వేయాలనుకున్నా. పియానోలో గ్రేడ్స్​​ చేశా. కానీ, సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లోవాళ్లు అంత తేలిగ్గా ఒప్పుకోలేదు! 

నాన్న షాక్​ అయ్యారు
డిగ్రీ డిస్​ కంటిన్యూ చేశా. మ్యూజిక్ వైపు వెళ్లాలనుకుంటున్నట్టు ఇంట్లో చెప్పా. ఆ మాట వినగానే నాన్న షాక్​. ఆయనకి ఇండస్ట్రీ స్ట్రగుల్స్ తెలుసు కాబట్టి.. మరో ఆలోచన లేకుండా వద్దన్నారు. యానిమేషన్​, సినిమాటోగ్రఫీ అంటే కాస్తోకూస్తో కన్విన్స్​ అయ్యేవాళ్లేమో.. కానీ, నేను అవేవీ కాకుండా మ్యూజిక్​ అనడంతో టెన్షన్​ పడ్డారు. వద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, నేను కాస్త మొండిగా మ్యూజిక్​లో నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. ఆ ప్రయత్నంలో కొన్ని అవమానాలు ఎదురయ్యాయి. నాతో కొందరు ఫ్రీగా వర్క్​ చేయించుకున్నారు కూడా. అవన్నీ దాటి మ్యూజిక్​ డైరెక్టర్​ కోటి దగ్గర కీబోర్డు ప్లేయర్​గా చేరా. ఆ టైంలో కోటీని  కలవడానికి వచ్చిన ఉప్పలపాటి నారాయణరావు నన్ను గమనించారు. ‘కీబోర్డు ఒక్కటేనా..  ట్యూన్స్​ ఏవైనా రెడీ చేసుకున్నావా’ అని అడిగారు. ఆ మాట రావడమే ఆలస్యం నా కంపోజిషన్స్ అన్నీ వినిపించా.. ఆయనకి అవి బాగా నచ్చడంతో ‘‘కుదిరితే అవకాశం ఇస్తాన’’ని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆయన ఆఫీసు నుంచి ఫోన్​ వచ్చింది. 

నన్ను నేను నమ్మలేదు
ఎక్స్​పీరియెన్స్​ లేకపోవడంతో ‘‘అసలు చేయగలనా? లేదా ?’’ అని  చాలా టెన్షన్​ పడ్డా. నా పరిస్థితే అలా ఉంటే ఇక ఆ సినిమా డైరెక్టర్​, ప్రొడ్యూసర్​ బాధేం చెప్పను. ఇరవై రెండేండ్ల నన్ను నమ్మి సినిమా చేతిలో పెట్టే సాహసం చేయలేకపోయారు వాళ్లు. టెస్ట్​ చేద్దామని ఒక హెవీ బ్రేకప్​ సాంగ్​ ఇచ్చారు. క్షణాల్లో ట్యూన్స్​ కట్టి వినిపించా. వెంటనే ‘‘జ్ఞాపకం” సినిమాకి మ్యూజిక్​ డైరెక్టర్​గా ఫైనల్​ చేశారు. కానీ, ఆ సినిమా పెద్దగా ఆడకపోవడం నాకు మైనస్ అయింది. ఆ బాధలో ఉన్నప్పుడే డైరెక్టర్​ రవిబాబు నుంచి పిలుపు వచ్చింది. ‘జ్ఞాపకం’ సినిమా పాటలు నచ్చి ‘అనసూయ’ సినిమాకి అవకాశం ఇచ్చారాయన. ఆ సినిమా చేస్తున్నప్పుడే ఆయన డైరెక్షన్​లో ‘నచ్చావులే’ కి సైన్​ చేశా. అది రిలీజ్​ అయ్యాక  వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఆ సినిమాలోని ప్రతి పాట సూపర్​ హిట్​ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి.

తెలుగు సింగర్స్​కీ అవకాశాలు 
యూట్యూబ్​, మ్యూజిక్​ యాప్స్ ద్వారా వరల్డ్​​ మ్యూజిక్​ అందరికీ దగ్గరవుతోంది. లాంగ్వేజ్​ బౌండరీలు లేకుండా అందరూ అన్ని భాషల పాటలూ వింటున్నారు . దాంతో మ్యుజీషియన్లు  కూడా కొత్తగా చేయాలి.. కొత్త సౌండింగ్​ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. అయితే సౌండింగ్​ , బీట్​, ఇనుస్ట్రుమెంట్స్​ ఎంత మారినా పాటలోని ఎమోషన్​ మాత్రం ఎప్పటికీ మారదు. మన దగ్గర పాడుతున్న ఇతర భాషల సింగర్స్​ విషయానికొస్తే..  వాళ్ల వాయిస్​లు చాలా పెక్యులియర్​గా ఉంటాయి. వాళ్లు తెలుగు పదాలు పలికే విధానం కూడా డిఫరెంట్​గా ఉంటుంది. అందుకే  వాళ్ల గొంతుకి సెట్ అవుతాయి​ అనిపించే పాటల్ని వాళ్లతోనే పాడిస్తుంటారు మ్యూజిక్​ డైరెక్టర్లు. అలాగని తెలుగు వాళ్లకి అవకాశాలు లేవని కాదు. నేనైతే నా సినిమాల్లో మన వాళ్లకే ఎక్కువ ప్రిఫరెన్స్​ ఇస్తుంటా.

అదే నా ప్రయారిటీ 
ఈ మధ్య ​ సోనీలో రిలీజ్​ అయిన ‘హ్యాష్​ట్యాగ్​ బ్రో’ సినిమాకి మ్యూజిక్​ ఇచ్చా. అలాగే  ప్రస్తుతం ‘అతిథి దేవోభవ’, ‘రైటర్ పద్మభూషణ్​’, ‘సమ్మతమే’తో పాటు మరో నాలుగు సినిమాలకి ట్యూన్స్​ కడుతున్నా. నా మ్యూజిక్​ పదిమందికీ నచ్చితే అంతకు మించిన తృప్తి ఇంకేం ఉండదు నాకు. అలాగే ఇప్పటివరకు నన్ను వెతుక్కుంటూ వచ్చిన సినిమాలు మాత్రమే చేసుకుంటూ వెళ్లా. కానీ, ఇకనుంచి నేను కూడా కొన్ని సినిమాల్ని వెతుక్కొంటూ వెళ్లాలనుకుంటున్నా. ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నా . పర్సనల్​ లైఫ్​ విషయానికొస్తే  నాన్న సినిమాటోగ్రాఫర్​గా అందరికీ పరిచయమే. మొదట్లో మ్యూజిక్​ వద్దని వాదించిన నాన్నే ఇప్పుడు నాకు మ్యూజిక్​ విషయంలో సలహాలు ఇస్తుంటారు. అమ్మ భాను హౌస్​ వైవ్​​. తనే నా మ్యూజిక్​ కెరీర్​కి బిగ్గెస్ట్​ సపోర్ట్​. సిచ్యుయేషన్​ ఏదైనా సరే నేనున్నానే ధైర్యం ఇస్తుంటుంది అమ్మ.  లవ్​ కమ్​ అరేంజ్డ్​ మ్యారేజ్​  నాది. నా బెటరాఫ్​ మాధురికి నా మ్యూజిక్​లో వచ్చిన ‘ కార్తికేయ’ సినిమాలోని ‘ సరిపోవు .. ’ పాటలంటే తనకి చాలా ఇష్టం. 

ప్రతి పాట కష్టమే
సిచ్యుయేషన్​ చెప్పగానే ట్యూన్​ వచ్చిన సందర్భాలు నా కెరీర్​లో చాలా తక్కువ. ఏ ట్యూన్​ అయినా త్వరగా శాటిస్​ఫాక్షన్ ఇవ్వదు నాకు. క్యాచీ ట్యూన్స్​​ కోసం చాలా ట్రై చేస్తుంటా. డైరెక్టర్​ పాట చెప్పగానే హీరోహీరోయిన్లు గ్రీనరీలో ఉన్నట్టు.. బీచ్​లో నడిచొస్తున్నట్టు ఊహించుకుంటా. అంతలా ఫీలై ట్యూన్​ కడతాను కాబట్టే ఒక్కో పాటకి ఐదో ​ రోజులు పడుతుంది. పదిహేను రోజులు టైం తీసుకున్న పాటలు కూడా ఉన్నాయి. బ్యాక్​ గ్రౌండ్​ స్కోర్​ విషయంలోనూ స్పెషల్​ కేర్ తీసుకుంటా. 

మ్యూజిక్​ చేసిన సినిమాల్లో కొన్ని
నచ్చావులే, మేం వయసుకు వచ్చాం,  కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా, సినిమా చూపిస్త మావ, సుబ్రహ్మణ్య పురం, నువ్విలా, సవారి, 118, అందగాడు, నాన్న నేను నా బాయ్​ఫ్రెండ్స్, బ్రదర్​ ఆఫ్​ బొమ్మాళి, పెళ్లి పుస్తకం, మనసారా. 

అదొక ఛాలెంజ్​
ఇప్పటివరకు 30 సినిమాలకి మ్యూజిక్​ ఇచ్చా. వాటిల్లో కల్యాణ్​ రామ్​ ‘118’  తప్పించి మిగతావన్నీ లిమిటెడ్ బడ్జెట్​లో తీసినవే. అప్​కమింగ్​ యాక్టర్స్​వే. వాళ్లు మ్యూజిక్​ డైరెక్టర్​పై ఎక్కువగా డిపెండ్​ అవుతారు. పాటలు హిట్​ అయితే సినిమాకి హైప్​ వస్తుందనుకుంటారు. దాంతో మ్యూజిక్​ విషయంలో ఎక్కువగా వర్కవుట్​ చేస్తుంటా. నా కష్టానికి తగ్గట్టే దాదాపుగా నేను మ్యూజిక్​ ఇచ్చిన పాటలన్నీ హిట్​ అయ్యాయి. కానీ,  చిన్న సినిమాలకి రీచ్​ తక్కువగా ఉండటంతో ..పెద్ద బ్యానర్లలో అవకాశాలు రాలేదు. పాటలు హిట్ అయితే పిలిచి అవకాశం ఇస్తారన్న ఆలోచనలోనే ఉన్నా నేనెప్పుడూ. కానీ, అది తప్పని కొన్నాళ్లకి అర్థమైంది. ఆడియో ఫంక్షన్లలో కొంతమంది డైరెక్టర్స్​ని కలిస్తే. ‘‘ఫలానా సాంగ్​ చేసింది నువ్వేనా’’ అని అడుగుతుంటారు. ఆ విషయంలో నాది తప్పులేకపోలేదు. కెరీర్​ స్టార్టింగ్​  నుంచి నన్ను నేను కాస్త ప్రమోట్ చేసుకొని ఉంటే బాగుండేది. 
::: ఆవుల యమున