
ముంబైలో దారుణం జరిగింది. ఓ యువకుడిపై ఆకతాయిల గుంపు దాడి చేసింది. హిందూ అమ్మాయితో తిరుగుతున్నావంటూ విచక్షణా రహితంగా కొందరు యువకులు కొట్టారు. బాంద్రా రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరగ్గా..ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లవ్ జిహాద్ ఆపాలి అంటూ వీడియోలో నినాదాలు చేశారు.
బాంద్రా రైల్వే స్టేషన్లో ముస్లిం యువకుడు ఓ హిందూ అమ్మాయితో కనిపించాడు. వీరిద్దరు రైల్వే స్టేషన్లో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అయితే ఈ సమయంలో 10 మంది యువకులు జై శ్రీరామ్ , వందేమాతరం నినాదాలు చేస్తూ ముస్లిం యువకుడిని కొట్టడం ప్రారంభించారు. అతని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. యువకుడిని కొట్టడం ఆపాలంటూ బురఖా ధరించిన ఒక బాలిక వేడుకుంది. అయినా కూడా యువకులు దాడి చేయడం ఆపలేదు. ఈ ఘటన జులై 21వ జరిగినట్లు తెలుస్తోంది. అయితే వీడియో వైరల్ కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ట్విస్ట్ ఏంటంటే..ఈ వీడియోలో బాధితులు అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ మైనర్లే.
ఈ ఘటనపై ఎఐఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్, సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే రయీజ్ షేక్ స్పందించారు. ఎవరైనా తప్పు చేస్తే దానికి చట్టం ఉందని.. అయితే ఒకరిని అలా కొట్టే హక్కు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో అంబర్ నాథ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అబ్బాయి, అమ్మాయి ఇద్దరికి ఒకరినొకరు తెలుసు అని చెప్పారు. దీనిపై బాలుడుపై కేసు నమోదు చేశామని..అతడు ప్రస్తుతం జువైనల్ కోర్టులో హాజరపర్చామని చెప్పారు.