
ప్రేమకు మతం లేదు... కులం లేదు .. ప్రేమికులు పెళ్లి చేసుకోవడానికి పెద్దలను ఒప్పించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తారు. కులాలు వేరయితేనే పెద్దలు పెళ్లికి నిరాకరిస్తారు. అలాంటిది ఏకంగా రెండు మతాలకు చెందిన యువతీ యువకులు పెళ్లి చేసుకొని మతం లేదు.. కులం లేదు.. ప్రేమ ముందు అన్ని బలాదూర్ అని నిరూపించారు.ఈ ఘటన యూపీలోని సీతాపూర్‌లో చోటుచేసుకుంది
వివరాల్లోకి వెళ్తే
ముస్లిం మతానికి చెంది రుబియా అనే యువతి హిందూ వ్యక్తి ప్రదీప్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి పెళ్లికి రుబియా కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ప్రేమికుడితో కలిసి హిందూ ఆచారం ప్రకారం వేద మంత్రోచ్ఛారణల మధ్య ఓ ఆలయంలో పెళ్లి చేసుకుంది. ప్రేమికుడితో కలిసి ఏడడుగులు నడిచిన రుబియా.. తన పేరును రజనీగా మార్చుకుంది. వీరి వివాహం విశ్వ హిందూ పరిషత్ సభ్యుల సమక్షంలో జరిగింది. వీరి వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆశీర్వదించారు. ఈ తతంగమంతా రాంపూర్ మధుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు
బిస్సార్‌లో నివసిస్తున్న ముస్లిం వర్గానికి చెందిన రుబియా, తంగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీడి సెవాలియాలో నివసిస్తున్న హిందూ యువకుడు ప్రదీప్ యాదవ్‌తో రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతోంది. రుబియా ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పి తాను హిందువులకు చెందిన ప్రదీప్ ను వివాహం చేసుకుంటానని చెప్పడంతో వారు వ్యతిరేకించారు. అయితే ఎలాగైనా తన ప్రేమికుడు ప్రదీప్‌ను వివాహం చేసుకోవాలని పట్టుదలతో రుబియా ఉంది. ఈ విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ వాసులు రూబియా గ్రామానికి చేరుకుని రుబియా, ప్రదీప్‌ల వివాహం ఓ గుడిలో జరిపించారు.
VHP ధర్మాచార్య చీఫ్ ఆచార్య దీపక్ మిశ్రా వీరిద్దరికి గుడిలో పెళ్లి జరిపించారు. అగ్నిహోత్రం సాక్షిగా ఇద్దరూ ఏడు ప్రదక్షిణలు చేసి పూలమాలలు వేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో రజనీ(రుబియా) కుటుంబ సభ్యులు పాల్గొనలేదు. రూబియా కుటుంబ సభ్యులు తమ కుమార్తెతో బంధాన్ని తెంచుకున్నారని తెలుస్తోంది. వీహెచ్ పీ సభ్యులు వీరి వివాహానికి హాజరయ్యారు.
ప్రేమకు మతం అడ్డు గోడ కాదు
ప్రేమకు మతం అడ్డుగోడ కాదని రుబియా(రజని), ప్రదీప్ నిరూపించారని అవధ్ ప్రావిన్స్ విశ్వహిందూ పరిషత్ విభాగం అధ్యక్షుడు విపుల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కాని అమ్మాయి కుటుంబసభ్యులు బలవంతంగా వేరే చోట పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ప్రేమికుల కోరిక మేరకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు.