నా కొడుక్కు మోడీ పేరొద్దు

నా కొడుక్కు మోడీ పేరొద్దు
  • కమ్యూనిటీ నన్ను వెలేసింది
  • యూపీ ముస్లిం మహిళ బాధ

మే 23. లోక్‌‌సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు. మంచి మెజార్టీతో నరేంద్ర మోడీ సర్కారు మరోసారి అధికారంలోకి వచ్చింది. ఆయనపై అభిమానంతో ఉత్తరప్రదేశ్‌‌ గోండాకు చెందిన ఓ ముస్లిం మహిళ ఫలితాల రోజే పుట్టిన తన బిడ్డకు మోడీ పేరు పెట్టింది. అప్పుడా వార్త సంచలనమైంది. ఇప్పుడు మళ్లీ అదే వార్త తెరపైకొచ్చింది. తన కొడుకుకు ఆ పేరొద్దంటోంది. మత పెద్దలు తనను వెలేశారని ఆవేదన వ్యక్తం చేసింది. కావాలని మోడీ పేరు పెట్టలేదని, తన బంధువొకరు అలా చేయించారని ఆమె చెప్పింది. తన కొడుకు మే 23న పుట్టలేదని, మే 12న జన్మించాడని వెల్లడించింది.

‘నా బంధువు ముస్తాక్‌‌ అహ్మద్‌‌ (జర్నలిస్టు) ఏం చెబితే అది చేసి మోసపోయా. చిన్నారికి మోడీ పేరు పెట్టమని చెప్పడమే కాకుండా తను మే 23న పుట్టాడని అందరినీ నమ్మించాడు’ అంటూ పర్సాపూర్‌‌ మహ్రౌర్‌‌ గ్రామానికి చెందిన మెహ్‌‌నాజ్‌‌ బేగం చెప్పారు. దుబాయ్​లో ఉండే తన భర్త డబ్బులు పంపడం లేదన్నారు.  ‘నా కమ్యూనిటీ వాళ్లు నన్ను వెలేశారు. ఇంటికి రావడం మానేశారు. మొన్న ఈద్‌‌కు చాలా తక్కువ మంది వచ్చారు’ అని చెప్పారు. తన కొడుకుకు కొత్తగా ‘అఫ్తాబ్‌‌ ఆలమ్‌‌ మహ్మద్‌‌ మోడీ’ అని పేరు పెడతానని చెప్పారు. పిల్లాడు మే 12న పుట్టాడని బేగంకు డెలివరీ చేసిన డాక్టర్‌‌ అశుతోష్‌‌ శుక్లా చెప్పారు.