ముత్తిరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన

ముత్తిరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన
  • జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి డిమాండ్
  • బీఆర్ఎస్​ను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర 
  • రాజేశ్వర్​ రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదు
  • ఉద్యమంలో పల్లా ఎక్కడున్నడని నిలదీత
  • అర్ధనగ్న ప్రదర్శనతో ముత్తిరెడ్డి వర్గీయుల నిరసన

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి దురాగతాలపై సీఎం కేసీఆర్​ ఎంక్వైరీ చేయించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కోరారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో తన అనుచరులు నిర్వహించిన అర్ధనగ్న ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు.

జనగామ, వెలుగు : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి దురాగతాలపై సీఎం కేసీఆర్​ ఎంక్వైరీ చేయించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కోరారు. బీబీనగర్​ ప్రాంతానికి చెందిన 286 మంది ప్లాట్లను కొడుకు అనురాగ్  రెడ్డి పేరిట కబ్జాచేసిన పల్లాపై ఈడీతో విచారణ జరపాలని, ఈ మేరకు బాధితులు డిమాండ్  చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పల్లా అనుచరుల ఆగడాలకు నిరనసగా జనగామ ఆర్టీసీ చౌరస్తాలో నల్ల జెండాలతో బీఆర్ఎస్​ పార్టీ దళిత నేతలు శనివారం చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శనకు ముత్తిరెడ్డి హాజరై మాట్లాడారు. నాడు ఆంధ్రోళ్లను తరిమికొట్టేందుకు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తే నేడు ఎమ్మెల్సీ పల్లా దుర్మార్గాలపై చేయాల్సి రావడం దౌర్భాగ్యం అన్నారు. పల్లా కొడుకు అనురాగ్​ రెడ్డి పేరిట ఉన్న భూములు బాధితులు 286 మందికే చెందుతాయని తహసీల్దార్​ కూడా చెప్పారని పేర్కొన్నారు. అధికార బలంతో  పల్లా పేదల పొట్టగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

పల్లాకు చిత్తశుద్ధి ఉంటే 286 మందికి భూమిని తిరిగి ఇచ్చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎక్కడున్నారని ప్రశ్నించారు. దళితులను జైల్లో పెట్టించడం అమానుషమన్నారు. బీఆర్ఎస్​ లీడర్లు ఆపద తీర్చాలి తప్ప ఆపద తేకూడదన్నారు. ‘‘చేర్యాలలో కలెక్టర్​ స్వయంగా పట్టా భూమి అని చెప్పినా  నా బిడ్డను తప్పుదోవ పట్టించిన కుట్ర పల్లా రాజేశ్వర్​ రెడ్డిదే. నా బిడ్డ ఆ భూమిని దానం చేస్తా అంటే స్వాగతించిన. పల్లా కుట్రలో నా బిడ్డ సమిధ అయింది. పల్లా దుర్మార్గాలపై ప్రజా కోర్టులో శిక్ష తప్పదు” అని ముత్తిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పల్లా కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనలో అగ్రికల్చర్​ మార్కెట్​ కమిటీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం తదితరులు పాల్గొన్నారు..