మ్యూచువల్ ఫండ్స్ ఫ్లాట్‌ఫారం క్లోజ్.. ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? డబ్బులు సేఫేనా..?

మ్యూచువల్ ఫండ్స్ ఫ్లాట్‌ఫారం క్లోజ్..  ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? డబ్బులు సేఫేనా..?

Piggy Mutual Funds: చాలా కాలంగా ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులతో పాటు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సైతం డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో అనేక సంస్థలు ఈ రంగంలో సేవలను అందించటానికి ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ పాపులర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్ ఫారం పిగ్గీ తన సేవలను జూన్ నెలాఖరు నుంచి క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే విషయాన్ని మెయిల్ ద్వారా తన కస్టమర్లకు కూడా వెల్లడించింది.

పిగ్గీ తన సేవలను నిలిపివేయటం వల్ల తమ కొనసాగుతున్న ఎస్ఐపీ పెట్టుబడులు, ఇప్పటికే ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ల పరిస్థితి ఏంటనే ఆందోళనలో యూజర్లు ఉన్నారు. దీనికి తోడు పన్ను మినహాయింపుల కోసం అవసరమైన ట్రాన్సాక్షన్ రికార్డులను పొందటం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పిగ్గీ కస్టమర్లకు పంపిన మెయిల్ లో మూసివేత తర్వాత ఎస్ఐపీలను మేనేజ్ చేయటం, పెండింగ్ రిడెమ్షన్స్, డివిడెండ్ వంటి అంశాలపై గైడ్ చేసింది. 

కస్టమర్లు గ్రహించాల్సిన విషయాలు..

* పిగ్గీ సేవలను బంద్ చేస్తున్నందున ఎస్ఐపీ ఆటోమేటెడ్ చెల్లింపులు కూడా నిలిచిపోతాయి. వాటిని కొనసాగించాలంటే యూజర్లు సదరు మ్యూచువల్ ఫండ్ వెబ్ సైట్ లేదా మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ నుంచి కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 

* ఇప్పటికే పిగ్గీ యాప్ ద్వారా చేస్తున్న ఎస్ఐపీ చెల్లింపులు ఈనెల 15 తర్వాత నిలిచిపోనున్నాయి. కావాలంటే వాటికి ఇంకా ముందుగానే నిలిపివేయెుచ్చని కంపెనీ వెల్లడించింది. లేదా మీ బ్యాంకును సంప్రదించటం ద్వారా కూడా చెల్లింపులను నిలిపివేయవచ్చు. 

* వాస్తవానికి కస్టమర్లు చేసిన పెట్టుబడులు సదరు మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ వద్ద ఉంటాయి. అందువల్ల పిగ్గీ క్లోజ్ అయినప్పటికీ వారి డబ్బు సేఫ్ గా ఉంటుంది. కానీ పిగ్గీలో ఉన్న మెుత్తం పెట్టుబడులకు సంబంధించిన వివరాలను మాత్రం రికార్డ్ చేసుకోవటం ఉత్తమం. 

* మీ డబ్బును వెనక్కి తీసుకోవాలంటే మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ లేదా మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ సంస్థను సంప్రదించొచ్చు. అయితే ఇందుకోసం ముందుగా పిగ్గీ యాప్ లో మీ పెట్టుబడుల వివరాలు వాటి ఫోలియో నంబర్లను మాత్రం జాగ్రత్తపరుచుకోండి.