నా పేరు ఎబిసిడిఇఎఫ్​​...

నా పేరు ఎబిసిడిఇఎఫ్​​...

పిల్లలకి పేరు పెట్టాలంటే పేరెంట్స్​ చాలా ఆలోచిస్తారు. ఎంతో మందిని అడుగుతారు. బుక్స్​ తిరగేస్తారు. కొత్తగా, డిఫరెంట్​గా, యునిక్​గా ఉండాలి అనుకుంటారు. అలా అని ‘‘అఆఇఈఉఊ, ఎబిసిడిఇఎఫ్​’’ అని పేర్లు పెడతారా? వింతగా అనిపిస్తోందా... ఈ పేరు చూడండి మరి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కొవిడ్ వ్యాక్సిన్​ క్యాంపెయిన్​లు జరుగుతున్నాయి. అలాగే ఇండోనేసియాలోని మౌరా ఎనిన్​లో ఉండే ‘‘జుజు’’ అనే పన్నెండేళ్ల పిల్లాడు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వ్యాక్సిన్ సెంటర్​కి వచ్చాడు. అక్కడ తన వివరాలను అప్లికేషన్​లో రాశాడు. అప్లికేషన్​లో తను రాసిన పేరు చూసి అక్కడున్నవాళ్లంతా తెగ నవ్వుకున్నారు. చిన్నపిల్లాడు కదా, స్పెల్లింగ్ మర్చిపోయి ఉంటాడు అనుకున్నారు. పిల్లాడిని పిలిచి “బాబూ నీ పేరేంటి?” అని అడిగారు. అందుకు ఆ అబ్బాయి తన పేరు ‘‘ఎబిసిడిఇఎఫ్​ జిహెచ్​ఐజెకె జుజు” అని చెప్పాడు.

జుజు వాళ్లతో జోక్​ చేస్తున్నాడు అనుకుని, తన పేరేంటో కన్ఫార్మ్ చేసుకోవడానికి వాళ్ల నాన్నని అడిగారు. జుజు వాళ్ల నాన్న కూడా ‘‘నా కొడుకు పేరు అదే” అన్నాడు. అయినా వాళ్లకి నమ్మబుద్ధి కాలేదు. దాంతో జుజు బట్టల మీద ఎంబ్రాయిడరీ చేసిన తన పేరుని చూపించాడు. స్కూల్ రిపోర్ట్స్​ కూడా చూపించాడు. అవన్నీ చూశాక వాళ్లకి నమ్మకం కలిగింది. జుజుకి వ్యాక్సిన్​ వేసి పంపించారు. అయితే, జుజుకి వాళ్ల నాన్న అలాంటి పేరు ఎందుకు పెట్టాడా? అనే సందేహం తీరలేదు కదా. జుజు వాళ్ల నాన్నకి క్రాస్​ వర్డ్స్​ పజిల్​ చేయడం అంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టంతోనే తన కొడుక్కి ఇలా పేరు పెట్టుకున్నాడట. కొందరేమో వాళ్ల నాన్నకి జుజుని రైటర్​ చేయాలనుందేమో అని కూడా అంటున్నారు. ఇకపోతే చివర్లో జుజు అని పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే... జుజు వాళ్ల పేరెంట్స్ పేర్లు జుహ్రో, జుల్ఫామి. ఆ రెండు పేర్లలో మొదటి అక్షరాలని పెట్టాడు. తనకు ఫ్యూచర్​లో పుట్టబోయే పిల్లలకు ‘‘ఎన్​ఓపిక్యూఆర్​ఎస్​టియువి”, ‘‘ఎక్స్​వైజెడ్” అని వాటికి కూడా చివర్లో అమ్మర్​, అత్తుర్​ అని చేరుస్తానని చెప్పాడు. ఇప్పుడైతే ఎబిసిడిఇఎఫ్​ జిహెచ్​ఐజెకె జుజు అనే పేరు పిలవడానికి కష్టంగా ఉందా? అయితే ముద్దు పేరు ‘‘అడెఫ్’’​ అని పిలవచ్చు అంటున్నాడు వాళ్ల నాన్న.