గ్రామాల్లో పెరుగుతున్న కొనుగోళ్లు .. 76 శాతానికి పైగా కుటుంబాలది ఇదే మాట

గ్రామాల్లో పెరుగుతున్న కొనుగోళ్లు .. 76 శాతానికి పైగా కుటుంబాలది ఇదే మాట
  • నాబార్డ్ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ:  పల్లెటూళ్ల జనం భారీగా ఖర్చు చేస్తున్నారని తేలింది. మనదేశంలో 76.6 శాతం గ్రామీణ కుటుంబాలు తమ వినియోగం పెరిగిందని వెల్లడించాయి. గ్రామీణ  ఆర్థిక  వ్యవస్థ బలపడుతోందని చెప్పడానికి ఇది రుజువని నాబార్డ్ సర్వే తెలిపింది.  ఈ సంస్థ రూరల్​ఎకనమిక్ ​కండిషన్స్​ అండ్​సెంటిమెంట్స్​ సర్వే (ఆర్​ఈసీఎస్​ఎస్​) పేరుతో చేసిన సర్వే రిపోర్ట్​ ప్రకారం..  మార్కెట్లలో వస్తువుల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 78.4 శాతం కంటే ఎక్కువ కుటుంబాలు ప్రస్తుత ద్రవ్యోల్బణం 5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉందని చెప్పాయి. సీపీఐ -గ్రామీణ ద్రవ్యోల్బణం మార్చిలో 3.25 శాతం నుంచి ఏప్రిల్‌‌లో 2.92 శాతానికి,  మేలో 2.59 శాతానికి తగ్గింది. మేలో ఆహార ద్రవ్యోల్బణం కూడా 1.36 శాతానికి తగ్గింది. 

తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేస్తామని 20.6 శాతం కుటుంబాలు వెల్లడించాయి. ప్రభుత్వ సంస్థల నుంచి మాత్రమే లోన్లు తీసుకుంటున్నామని 52.6 శాతం కుటుంబాలు  పేర్కొన్నాయి.  వడ్డీ వ్యాపారుల వాటా కంటే స్నేహితులు,  బంధువుల నుంచి ఎక్కువగా అప్పులు తీసుకుంటున్నారు.  అనధికారిక లోన్​పై చెల్లించే సగటు వడ్డీ రేటు దాదాపు 30 బేసిస్ పాయింట్లు తగ్గింది.  భవిష్యత్​లో తమ ఆదాయం పెరుగుతుందని 74.7 శాతం మంది చెప్పారు.

 56.2 శాతం మంది స్వల్పకాలంలో మెరుగైన ఉద్యోగ అవకాశాలను కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు ఆహారం, విద్యుత్, వంట గ్యాస్, ఎరువులు, పాఠశాల అవసరాలు, రవాణా, భోజనం, పెన్షన్లు,  వడ్డీ సబ్సిడీల కోసం చెల్లిస్తున్న మొత్తం ఒక ఇంటి నెలవారీ ఆదాయంలో దాదాపు 10 శాతం వరకు ఉంది.  రోడ్లు, విద్యుత్, నీరు, విద్య,  ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక సేవలపై కేవలం 2.6 శాతం కుటుంబాలు మాత్రమే అసంతృప్తిని ప్రకటించాయని నాబార్డ్​ రిపోర్ట్​ వెల్లడించింది.