Naga Chaitanya : 'తండేల్' జోరు.. బుల్లితెరపై దుమ్మురేపిన నాగ చైతన్య, సాయి పల్లవిల జోడీ!

Naga Chaitanya : 'తండేల్' జోరు..  బుల్లితెరపై దుమ్మురేపిన నాగ చైతన్య, సాయి పల్లవిల జోడీ!

Thandel : యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya )  , సాయి పల్లవి ( Sai Pallavi ) ప్రధాన పాత్రల్లో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'తండేల్' ( Thandel ) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్ ప్రేక్షకులను కూడా మంత్రముగ్ధులను చేసింది. జీ తెలుగులో ప్రసారమైన 'తండేల్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంచనాలకు మించి 10.32 టీఆర్పీ (అర్బన్) రేటింగ్‌తో సంచలనం సృష్టించింది. అర్బన్, రూరల్ (U+R) మార్కెట్లలో కూడా 8.75 టీఆర్పీ సాధించి, ఈ ఏడాది టాప్ 3 టీఆర్పీ రేటింగ్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇది సినిమాకు థియేటర్లలో వచ్చిన ఆదరణకు, టీవీ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలచింది.

బుల్లితెరపై టాప్ 3 స్థానంలో 'తండేల్'
థియేటర్లలో 7, ఫిబ్రవరి 2025లో విడుదలైన 'తండేల్'..  జీ తెలుగు టీవీలో జూన్ 29 2025న ప్రసారమైంది.  బాక్సాఫీస్ వద్దే కాదు బుల్లితెరపై కూడా సత్తా చాటింది.  'తండేల్' సాధించిన 10.32 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది.  ఇది 'సంక్రాంతికి వస్తున్నాం' (  TRP15.92 ) , 'పుష్ప 2: ది రూల్' ( TRP 12.61 ) వంటి భారీ అంచనాల చిత్రాల తర్వాత అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ రెండు సినిమాలు ఇప్పటికే భారీ అంచనాలతో వచ్చి ప్రేక్షకులను అలరించాయి. వాటి సరసన 'తండేల్' నిలవడం సినిమా బృందానికి, ముఖ్యంగా యువ సామ్రాట్ నాగ చైతన్య , లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి గొప్ప విజయాన్ని అందించింది..

ఆకట్టుకున్న నాగ చైతన్య – సాయి పల్లవి కెమిస్ట్రీ

'తండేల్' టీవీలో కూడా  ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు సినీ విశ్లేషకులు. నాగ చైతన్య – సాయి పల్లవి కెమిస్ట్రీ ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకుంది.  వీరిద్దరి కాంబినేషన్ గతంలో 'లవ్ స్టోరీ' చిత్రంలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. 'తండేల్'లో మత్స్యకారుల నేపథ్యంలో వీరిద్దరి సహజ నటన, అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. థియేటర్లలో చూడని వారికి బుల్లితెర మరొ అవకాశంగా నిలిచింది.  అంతే కాదు దర్శకుడు చందూ మొండేటి ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితాలను, వారి కష్టాలను వాస్తవికంగా చూపించారు. భావోద్వేగాలను పండించడంలో ఆయన నైపుణ్యం సినిమా విజయానికి తోడ్పడింది. అటు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. ముఖ్యంగా పాటలు విడుదలకు ముందే బాగా పాపులర్ అయ్యాయి.  బన్నీ వాసు నిర్మాతగా, అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ముఖ్యంగా మత్స్యకారుల జీవితాలు, వారి సాహసాలు, ప్రేమ కథ, దేశభక్తి వంటి అంశాలను మిళితం చేసి రూపొందించిన కథాంశం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.

►ALSO READ | Prabhas : ‌ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పదేళ్ల సందర్భంగా థియేటర్లలోకి 'బాహుబలి'.. డేట్ ఫిక్స్డ్!

ఓటీటీ, టీవీల్లో కొనసాగుతున్న జోరు
థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టిన 'తండేల్' ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు టీవీ ప్రీమియర్‌లోనూ సంచలనం సృష్టించడంతో, ఈ సినిమా అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఇది చిత్ర బృందానికి, ముఖ్యంగా హీరో నాగ చైతన్యకు తన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుంది. 'తండేల్' సాధించిన ఈ టీఆర్పీ రేటింగ్, కుటుంబ ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుందని రుజువు చేస్తోంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.  గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు విశేషంగా ప్రేక్షకాదరణ లభించింది.