80 ఏండ్ల వయసులో..​హెయిర్​ ఆయిల్ బిజినెస్

80 ఏండ్ల వయసులో..​హెయిర్​ ఆయిల్ బిజినెస్

వయసు శరీరానికి మాత్రమే.. మనసుకి కాదు. ఏదైనా సాధించాలన్న పట్టుదలకి అంతకన్నా కాదు. అందుకు ఉదాహరణే 88 ఏండ్ల ఈ బామ్మ. పేరు నాగమణి. అరవై ఏండ్ల వయసులో ‘రూట్స్​ అండ్​ షూట్స్’​ పేరుతో ​ బిజినెస్​ స్టార్ట్​ చేసింది ఈ బామ్మ. నూట యాభై ఏండ్ల కిందటి హెయిర్​ ఆయిల్ను  మార్కెట్​లోకి తీసుకొచ్చింది. మంచి లాభాలతో.. సక్సెస్​ఫుల్​ ఎంట్రప్రెనూర్​గా రాణిస్తున్న​ ఈ బామ్మ గురించి.. 

అందరూ ప్రేమగా ‘మణి ఆంటీ’ అని పిలుచుకునే ఈ బామ్మ కర్నాటకలో పుట్టింది. పొడవాటి జుట్టును ఇష్టపడే ఈమెకి..24 ఏండ్ల వయసులోనే జుట్టు రాలిపోవడం  మొదలైంది. ఎన్ని వంటింటి చిట్కాలు ఫాలో అయినా.. జుట్టు ఊడటం ఆగలేదు. దాంతో మైసూర్​లో ఉండే తన ఫ్రెండ్​కి ఫోన్​ చేసింది. నాగమణి సమస్య విన్న ఆమె.. వాళ్ల అమ్మమ్మల నుంచి నేర్చుకున్న సీక్రెట్​ హెయిర్​ ఆయిల్​తయారీ చెప్పింది. అది వాడాక జుట్టు హెయిర్​ ఫాల్ సమస్య ఆమె దరిదాపుల్లోకి కూడా రాలేదు. దాంతో ఆ హెయిర్​ ఆయిల్​ని తెలిసినవాళ్లకు, బంధువులకు కూడా తయారు చేసి ఇచ్చింది. అందరూ ఫుల్​ హ్యాపీ.. మార్కెట్​లోకి తీసుకురమ్మని సలహాలు కూడా ఇచ్చేవాళ్లు. 

క్యాన్సర్​ నుంచి కోలుకొని.. 
హెయిర్ ఆయిల్​ బిజినెస్​లోకి రావాలని ఉన్నా... భర్త , ఇద్దరు పిల్లల బాధ్యత, ఇంటి పనులే తన మొదటి ప్రయారిటీ అనుకుందామె. కానీ, తనకి అరవై ఏండ్లు వచ్చేసరికి.. భర్త తోడు దూరమైంది. పిల్లలు ఉద్యోగాలతో బిజీ అయ్యారు. దాంతో ఒంటరితనం నుంచి బయటపడటానికి తనకిష్టమైన హెయిర్​ ఆయిల్​ తయారీ రంగంలోకి రావాలనుకుంది. అనుకున్నట్టుగానే ‘రూట్స్​ అండ్​ షూట్స్’​ పేరుతో మార్కెట్​లోకి తీసుకొచ్చింది. అలా సాగిపోతున్న టైంలో క్యాన్సర్​ ఆమె శరీరాన్ని కుంగదీసింది. దాన్నుంచి కాస్త బయటపడగానే పెద్ద కూతురు ఇక లేదన్న వార్త ఆమెని కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ  పరిస్థితులన్నింటి నుంచి బయటకు రావడానికి.. బిజినెస్​పైనే పూర్తిగా దృష్టి పెట్టింది. చిన్న కూతురు కూడా తనకి చెయ్యి అందించడంతో అప్పటివరకు కాలక్షేపంగా చేసిన బిజినెస్​ని సీరియస్​గా తీసుకుంది. ఎలాంటి ప్రమోషన్స్​ లేకుండా కేవలం నోటి మాట ద్వారానే ఈ బామ్మ హెయిర్​ ఆయిల్​ ఫేమస్​ అయింది. తెలిసినవాళ్ల ద్వారా ఇతర దేశాల్లోనూ పాపులర్​ అయింది. 

చేతితో పొడి చేసి..
కొబ్బరి నూనెతో పాటు మరో నాలుగు నూనె గింజలతో ఈ హెయిర్​ ఆయిల్ తయారుచేస్తోంది బామ్మ. ఈ ఆయిల్​కి అవసరమయ్యే రెండు రకాల గింజలని హిమాలయాల నుంచి తెప్పిస్తుంది. వాటన్నింటినీ చేతితో పొడి చేసి కొబ్బరి నూనెలో కలుపుతుంది. ఆరు వారాలు ఆ నూనెని ఎండ తగిలే చోట ఉంచి.. డబ్బాల్లో నిల్వ చేస్తుంది. అన్ని కాలాల్లో నూనె తయారీకి సరిపడా ఎండ ఉండదు కాబట్టి.. సంవత్సరానికి సరిపడా స్టాక్​ని ఒకేసారి తయారుచేస్తుంది. మూడొందల ఎమ్​ఎల్​ నూనె బాటిల్​ని ఆరొందల రూపాయలకి అమ్ముతుంది. 

“ఈ ఆయిల్​ 150 ఏండ్ల కిందటిది. దీని తయారీలో వాడే పదార్థాలన్నీ ఆర్గానిక్​వే. పైగా ఎలాంటి మెషిన్స్​ సాయం తీసుకోకుండా.. ఈ నూనె తయారుచేస్తాం. దీన్ని పెద్ద మొత్తంలో మార్కెట్​లోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. కానీ, దానికి సరైన పార్ట్​నర్స్​, టీం కావాలి. రానున్న జనరేషన్స్​కి ఈ ఆయిల్​ పరిచయం చేయాలన్నదే నా లక్ష్యం’’ అని చెప్తోంది.