- ఎస్పీ సంగ్రామ్ సింగ్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ ఆఫీస్ వద్ద పాలెం అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫ్రాడ్ కో ఫుల్ స్టాప్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 2 నుంచి 12 వరకు వివిధ రకాల ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
డిజిటల్ అరెస్ట్ అంశం పోలీస్ శాఖ పరిధిలో లేదని, ఆ పేరు పై వచ్చే ఫోన్ కాల్స్ మోసపూరితమైనవని తెలిపారు. ఏఐ టూల్స్ ఉపయోగించి ఫొటోలు మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటికి భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. బ్యాంకులు ఓటీపీలు, ఈ–కేవైసీ కోసం ఫోన్ చేయవని, అలాంటి కాల్స్‌కు స్పందించకూడదని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా సైబర్ క్రైమ్ టీం ఉపేందర్ రావు, పాలెం యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.
