నాగర్కర్నూలు జెడ్పీ ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

నాగర్కర్నూలు జెడ్పీ  ఛైర్మన్  ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
  • జెడ్పీ ఛైర్మన్ పీఠం దక్కేది ఎవరికో.. ?
  • టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ పైనే భారం వేసిన నేతలు

నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబరు 15న నోటిఫికేషన్ విడుదల చేసి.. ఇదే నెల 22న జడ్పీ చైర్మన్ ఎంపిక పూర్తి చేసేలా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. జెడ్పీ చైర్మన్ గా ఉన్న పద్మావతికి ముగ్గురు సంతానమున్న కారణంగా ఆమె ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఎన్నిక అక్రమమని కోర్టు నిర్ధారించడంతో తాను ప్రాతినిధ్యం వహించిన తెలకపల్లి జెడ్పీటీసీ పదవి నుంచి కూడా వైదొలిగారు. దీంతో జెడ్పీ చైర్మన్ ఇంచార్జి బాధ్యతలు  చారకొండ జెడ్పీటీసీ బాలాజీసింగు చేపట్టారు. హైకోర్టు తీర్పు మేరకు పద్మావతి కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయిన సుమిత్ర తెలకపల్లి జెడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికారికంగా జెడ్పీ చైర్మన్ ఎన్నికకు ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 

నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా 16 స్థానాలు టీఆర్ఎస్, 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. స్పష్టమైన మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ చైర్మన్ పీఠం ఎవరికి అప్పగిస్తుందనేది చర్చనీయాంశమైంది. జెడ్పీ చైర్మన్ గా కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ ఎంపిక లాంఛనమే అన్న చర్చ జరుగుతోంది. విద్యావంతుడు యువకుడైన భరత్ ప్రసాద్ ను జెడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టాలనే ఆలోచనతో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.    

అయితే జెడ్పీ చైర్మన్ పీఠాన్ని ఊరుకొండ జెడ్పీటీసీ శాంత కుమారి సైతం ఆశిస్తున్నారు. అయితే ఈమె ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీటీసీ స్థానం మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. దీంతో శాంత కుమారికి జెడ్పీ చైర్మన్ స్థానం దక్కే అవకాశాలు కనిపించడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ స్థానం ఎస్సీ రిజర్వు కావడంతో భరత్ ప్రసాద్ కు జెడ్పీ చైర్మన్ పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్ర అధిష్టానం కూడా భరత్ ప్రసాద్ ని బలపరుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నోటిఫికేషన్ విడుదలతో ఈ అంశం నాగర్ కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.