వరద తగ్గింది..సాగర్‌ క్రస్ట్‌ గేట్ల మూసివేత

వరద తగ్గింది..సాగర్‌ క్రస్ట్‌ గేట్ల మూసివేత

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ క్రస్ట్‌‌‌‌ గేట్లను ఆదివారం మూసేశారు. ఎగువ నుంచి భారీ వరద రావడంతో గత నెల 29న 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల ప్రారంభించారు. వరద తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఉదయం 2 గేట్ల ద్వారానే నీటిని విడుదల చేసిన ఆఫీసర్లు.. మధ్యాహ్నం 11 గంటలకు వాటిని కూడా మూసేశారు. 

సాగర్‌‌‌‌కు ప్రస్తుతం 63,580 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ ఫ్లో వస్తోంది. సాగర్‌‌‌‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. సాగర్‌‌‌‌ నుంచి కుడి, ఎడమ కాల్వలకు 8,022 క్యూసెక్కుల చొప్పున, ఏఎంఆర్పీకి 1,800 క్యూసెక్కులు, వరద కాల్వకు 300 క్యూసెక్కులు వదులుతున్నారు. కాగా, ఆదివారం భారీ సంఖ్యలో సాగర్‌‌‌‌కు వచ్చిన పర్యాటకులు.. గేట్ల మూసివేత విషయం తెలుసుకొని నిరాశ చెందారు. పర్యాటకుల రద్దీ కారణంగా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌‌‌‌కు అంతరాయం ఏర్పడింది.