హాలియా, వెలుగు : పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలను నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదని మంగళవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే హాస్టల్కు వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మధ్యాహ్నం భోజనం, వంట సామగ్రిని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం తిరుమలగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ అనుపమానరేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నారాయణగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ చంద్రారెడ్డి, రాజా రమేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు.
కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే
నల్గొండ అర్బన్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడి నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమ్మరికుంట కాల్వ గ్రామానికి చెందిన కన్నెబోయిన కొండల్ ను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆయన సూచించారు.