
- నిండుకుండలా సాగర్, పులిచింతల
- నాగార్జున సాగర్కుపోటెత్తిన పర్యాటకులు
- ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తివేత
- భారీగా ట్రాఫిక్ జామ్
హాలియా, మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు : ఇటీవల కురిసిన వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. జిల్లాలో కురిసిన వర్షాలే కాకుండా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలకు భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జునసాగర్20 గేట్లు, పులిచింతల ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ జలాశయానికి వరద ప్రవాహం..
నాగార్జునసాగర్ కృష్ణమ్మ పరవళ్లు పెడుతుండడాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో సాగర్ పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకుంది. నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో అధికారులు మొత్తం 20 క్రస్ట్ గేట్లను 5 అడుగులు, మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శనివారం ఉదయం 14 గేట్ల ద్వారా కొనసాగిన నీటి విడుదల ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఎన్ఎస్పీ అధికారులు మరో 6 గేట్లను ఎత్తి మొత్తం 20 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం, కుడి గట్టు విద్యుత్ కేంద్రం,5 స్పిల్ వే గేట్ల ద్వారా మొత్తం 1,99,544 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ జలాశయం నుంచి 1,56,760 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం నీటిమట్టం 587.50 అడుగులు..
సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు (305.4050 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 587.50 అడుగుల(305. 8030) నీరు నిల్వ ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతానికి ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 28,217 క్యూసెక్కుల నీటిని, కుడి కాల్వల ద్వారా 6006 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వ ద్వారా 2067, ఎస్ఎల్బీసీ 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నుంచి మొత్తం 1,96,976 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నిండుకుండలా పులిచింతల..
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద వచ్చి చేరుతోంది. దీంతో బ్యాక్ వాటర్ గణనీయంగా పెరిగింది. శనివారం పులిచింతల ప్రాజెక్టుకు 1,86,722 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, ఆరు గేట్లను నాలుగు మీటర్ల మేర ఎత్తి 1,96,587 క్యూసెక్కుల నీటి కిందకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 175 అడుగులకు కాగా, 171.4 అడుగుల నీరు నిల్వ ఉంది. తెలంగాణ పరిధిలోని జెన్ కోలో నాలుగు యూనిట్ల ద్వారా నిరంతరాయంగా పవర్ జనరేషన్ కొనసాగుతోంది. ఇందు కోసం 16,600 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.
పెరిగిన పర్యాటకుల తాకిడి..
శుక్ర, శనివారం సెలవు రోజులు కావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున నాగార్జునసాగర్‌కు తరలివచ్చారు. సాగర్‌లోని కొత్త బ్రిడ్జి, శివాలయం రోడ్ మొదలుకుని హిల్ కాలనీ వరకు సుమారు 2 కిలో మీటర్ల మేర భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు వాహనాల ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.