నిండు కుండలా సాగర్ ప్రాజెక్ట్... మరోసారి ప్రాజెక్ట్ గేట్ల ఎత్తే చాన్స్

నిండు కుండలా సాగర్ ప్రాజెక్ట్... మరోసారి ప్రాజెక్ట్ గేట్ల ఎత్తే చాన్స్
  • ప్రస్తుతం  ప్రాజెక్ట్ లో 589 అడుగులకు నీరు 

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్​ ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టానికి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఒక అడుగు దూరంలో ఉంది. పూర్తి నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు)కాగా, శ్రీశైలం నుంచి 43,999  క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ముందస్తు వానలతో  వరదల కారణంగా శ్రీశైలం గేట్లను గత నెలలో ఎత్తారు.

 దీంతో దిగువన సాగర్​ప్రాజెక్ట్ లోనూ నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో గత నెల 28 ప్రాజెక్ట్​26 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. అనంతరం ఈనెల 3న మూసివేశారు. ప్రాజెక్ట్ అధికారులు సాగర్​లో కొద్దిరోజులుగా 585 అడుగుల నీటిని మెంటెన్​చేస్తూ.. ఎగువ నుంచి వచ్చే వరదను బట్టి అంతేమొత్తంలో దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్​ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో మరోసారి సాగర్​గేట్లను ఎత్తే చాన్స్​ఉందని ఇరిగేషన్​ అధికారులు అంచనా వేస్తున్నారు.

 ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 589. 01 అడుగులు( 309.3558టీఎంసీలు) ఉంది. ఇందులోంచి ఎడమకాల్వకు 5,598  క్యూసెక్కులు, కుడి కాల్వకు 7,353 క్యూసెక్కులు, హైదరాబాద్ ట్విన్ సిటీస్ తాగునీటికి గాను ఏఎమ్మార్పీకి 1800 క్యూసెక్కులు, అవుట్​ఫ్లోగా 43,999 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.