సాగర్ డ్యామ్ భద్రతపై గందరగోళం

సాగర్ డ్యామ్ భద్రతపై గందరగోళం
  • తాజాగా ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తెలంగాణ సీఆర్పీఎఫ్ దళాలు
  •  ఏపీ సీఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణలోకి   డ్యామ్ పూర్తి భద్రత 
  • మన రాష్ట్రానికి చెందిన ఇరిగేషన్ అధికారుల్లో ఆందోళన

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. డ్యామ్ వద్ద తెలంగాణ వైపు విధుల్లో ఉన్న సీఆర్‌‌పీఎఫ్‌‌ సిబ్బందిని వెనక్కి రమ్మని మంగళవారం ఆదేశాలు అందాయి. రెండురోజుల కింద ఏపీ వైపు కూడా సీఆర్‌‌పీఎఫ్‌‌ సిబ్బందికి ఇదే తరహాలో ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. అయితే.. ఏపీ బలగాల పరిధిలోకి  తెలంగాణ వైపు కూడా సాగర్ భద్రత వెళ్లింది. దీంతో సాగర్ ప్రాజెక్టు నీటిపారుదల శాఖ అధికారులు ఆందోళనలో పడ్డారు. 

దీనిపై తెలంగాణకు చెందిన నీటిపారుల అధికారులు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సాగర్‌‌ ప్రధాన డ్యామ్‌‌ వద్ద సీఆర్‌‌పీఎఫ్‌‌ బలగాలు విధుల నిర్వహణపై ప్రస్తుతం తీవ్ర గందరగోళం నెలకొంది.  గత అసెంబ్లీ ఎన్నికల ముందు నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదంతో కేంద్రం జోక్యం చేసుకుంది. దీంతో ప్రాజెక్టు పై రెండు రాష్ట్రాల పెత్తనం లేకుండా కేంద్రమే సీఆర్పీని రంగంలోకి దించింది. దీంతో ప్రాజెక్టు భద్రత, నిర్వహణ పూర్తిగా కేంద్ర బలగాల పర్యవేక్షణలోకి వెళ్లింది. 

సుమారు18 నెలలుగా కేఆర్ఎంబీ ఆధీనంలోనే డ్యామ్ భద్రత ఉంది. కాగా డ్యామ్ వద్ద తెలంగాణ వైపు ములుగు జిల్లాకు చెందిన 39వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బందిని పెట్టగా.. గతేడాది డిసెంబర్ లో వెనక్కి రావాలని ఆదేశాలు వెళ్లగా.. ప్రాజెక్ట్ ను వీడి నల్గొండ దాకా వెళ్లారు. తిరిగి విధుల్లోనే కొనసాగాలని అదేరోజు సాయంత్రం మళ్లీ ఆదేశాలు వెళ్లడంతో  రాత్రికి సాగర్‌‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తెలంగాణ బలగాలను వెనక్కి పంపించి, ఇంకోవైపు ఏపీ బలగాలకు పూర్తి భద్రత వెళ్లడంతో ఆందోళన నెలకొంది.