
- ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి
మిర్యాలగూడ, వెలుగు : అర్హులైన రైతులందరికీ అసైన్ మెంట్ పట్టాల జారీకి కమిటీ ఆమోదం తెలిపినట్లు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి వెల్లడించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో మంగళవారం నిర్వహించిన అసైన్ మెంట్ కమిటీ మీటింగ్ లో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి ఆయన మాట్లాడారు. తిరుమలగిరి సాగర్ మండల పరిధిలో గత కొన్నేళ్ల నుంచి భూములపై సరైన హక్కులు లేక ఇబ్బందులకు గురవుతున్న రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా మండల పరిధిలోని 13 గ్రామాల్లో రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి సర్వే చేపట్టి కబ్జాలో ఉండి సేద్యం చేస్తున్న రైతుల వివరాలను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. ఆయా గ్రామాల నుంచి గుర్తించిన రైతులకు అసైన్ మెంట్ (లావుని) పట్టాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. సుమారు 4,500 మంది రైతులకు 4 వేల ఎకరాలకు అసైన్ మెంట్ పట్టాలు ఇస్తామన్నారు. పట్టాల జారీకి అసైన్మెంట్ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, తహసీల్దార్లు అనిల్ కుమార్, హరిబాబు, జవహర్ తదితరులు పాల్గొన్నారు.