ఆరు నెలల కింద భర్తను.. ఇప్పుడు కూతురిని

ఆరు నెలల కింద భర్తను.. ఇప్పుడు కూతురిని
  • నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లాలో ఆరేండ్ల కూతురిని చంపిన తల్లి
  • భర్తను చంపిన కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చిన మహిళ

లింగాల,  వెలుగు : భర్తను చంపిన కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌‌‌‌పై బయటకు వచ్చిన మహిళ.. మద్యం మత్తులో ఆరేండ్ల కూతురిని సైతం చంపేసింది. ఈ ఘటన నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నంపల్లి గ్రామానికి చెందిన మేకల ఎల్లమ్మ గతేడాది డిసెంబర్‌‌‌‌లో తన భర్త రాములును హత్య చేసింది. ఈ కేసులో మూడు నెలలు జైలులో ఉన్న ఎల్లమ్మ రెండు నెలల కిందే బెయిల్‌‌‌‌పై ఇంటికి వచ్చింది.

సోమవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న ఎల్లమ్మ ఇంట్లో నిద్రిస్తున్న తన రెండో కుమార్తె నవిత (6)ను ఎత్తుకెళ్లి ఇంటి పక్కన ఉన్న సంప్‌‌‌‌లో పడేసింది. కొద్దిసేపటి తర్వాత ఏడుస్తూ కూర్చుంది. చుట్టుపక్కల వారు గమనించి ఏమైందని ప్రశ్నించగా ఎవరో వచ్చి తన పాపను ఎత్తుకెళ్లి సంప్‌‌‌‌లో పడేశారని చెప్పింది. వారు సంప్‌‌‌‌ వద్దకు వెళ్లి పాపను బయటకు తీసి చూడగా అప్పటికే చనిపోయింది.

అనుమానం వచ్చిన బంధువులు ఎల్లమ్మను నిలదీయడంతో తానే సంప్‌‌‌‌లో పడిసినట్లు ఒప్పుకుంది. భర్తను చంపిన కేసులో బంధువుల వల్లే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఎల్లమ్మ నిత్యం బంధువులను తిడుతూ ఉండేది. ఈ విషయాన్ని నవిత బంధువులకు చెబుతుందన్న కోపంతోనే చిన్నారిని హత్య చేసినట్లు ఎల్లమ్మ తెలిపింది. విషయం తెలుసుకున్న సీఐ రవీందర్‌‌‌‌, ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.