క్షేత్రపాలకుడికి ఘనంగా నాగవల్లి దళార్చన

క్షేత్రపాలకుడికి ఘనంగా నాగవల్లి దళార్చన

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి మంగళవారం అర్చకులు నాగవల్లి దళార్చన పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొండపై విష్ణుపుష్కరిణి పక్కన ఉన్న హనుమాన్ టెంపుల్ లో హనుమంతుడి మూలవిరాట్ ను మొదట పవిత్ర జలంతో శుద్ధి చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం సింధూరంతో అందంగా అలంకరించి ప్రత్యేకంగా తెప్పించిన నాగవల్లి దళాలతో అర్చన చేశారు. వేదమంత్రాల మధ్య జరిగిన ఆకుపూజలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

లలితాపారాయణం చేసి ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించారు.  అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారికి నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా మంగళవారం ఆలయానికి రూ.25,68,848 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

రేపు బ్రేక్ దర్శనాలు, జోడు సేవలు రద్దు..

ఈనెల 15న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రపంచ సుందరీమణులు రానున్న సందర్భంగా రేపు సాయంత్రం బ్రేక్ దర్శనాలు, జోడు సేవలు ఒక్కరోజు తాత్కాలికంగా రద్దు చేయనున్నట్లు ఆలయ ఈవో వెంకటరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 16 నుంచి బ్రేక్ దర్శనాలు, జోడు సేవలు తిరిగి యథాతధంగా కొనసాగుతాయని తెలిపారు.