పార్ట్ టైం కూలీగా చేస్తూ.. స్టూడెంట్స్ కి ఫ్రీ కోచింగ్ ఇస్తున్న లెక్చరర్

పార్ట్ టైం కూలీగా చేస్తూ.. స్టూడెంట్స్ కి ఫ్రీ కోచింగ్ ఇస్తున్న లెక్చరర్

పేదరికం అతన్ని వెక్కిరించింది. కన్న కలల్ని, ఆశయాల్ని నెరవేరకుండా చేసింది. చిన్న  వయసులోనే కుటుంబ భారాన్ని మోసేలా చేసింది. అయినా, వాటన్నింటినీ లెక్క చేయలేదు. కష్టే ఫలీ అనే మాటను నమ్ముకున్నాడు. చివరికి అనుకున్నది సాధించాడు.  లెక్చరర్ జాబ్  చేస్తూనే, తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ఇంకెవరూ పడకుండా చూడాలని పార్ట్ టైం రైల్వే కూలీగా మారాడు ఒడిషాలోని నగేషు పాత్రో. 

ఒడిషా, గంజాం జిల్లాకు చెందిన సీహెచ్ నగేషు పాత్రో నిరుపేద కుటుంబంలో పుట్టాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ కారణంగా చిన్నతనంలోనే చదువు మానేసి కూలి పనికి వెళ్లేవాడు.  కొన్ని రోజులు సూరత్ లోని టెక్స్ టైల్ మిల్లులో, హైదరాబాద్ లోని షాపింగ్ మాల్ లో పనిచేశాడు. అయితే, ఇలా పనిచేస్తున్నప్పుడే 
చదువుపై మళ్లీ ఇంట్రెస్ట్ కలిగింది. దాంతో ఒడిషా వెళ్లి పని చేసుకుంటూనే ఓపెన్ లో చదువుకున్నాడు. అలా ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి తర్వాత బెర్హంపూర్ యూనివర్సిటీ నుంచి పీడీ పట్టా అందుకున్నాడు. 

జీవితం నేర్పిన బతుకు పాఠమే నగేషుని లెక్చరర్ గా మార్చింది. అయితే, తనలా ఫీజులు కట్టలేక చదువు మధ్యలో ఆపేసిన వాళ్లకు సాయం అందించాలనుకున్నాడు. అందుకు ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ కూడా స్టార్ట్ చేశాడు. అందులో ఇద్దరు గెస్ట్ లెక్చరర్లని కూడా నియమించాడు. అయితే, వాళ్లకు జీతాలు ఇవ్వడం కోసం పగలు లెక్చరర్ గా పాఠాలు చెప్తూ, సాయంత్రం పార్ట్ టైం కూలీగా పనిచేస్తున్నాడు. కూలీ డబ్బులు నెలకు రూ.12వేల వరకు వస్తున్నాయట. వాటిద్వారా కోచింగ్ సెంటర్ మెయింటెనెన్స్ ఈజీ అవుతుందని చెప్తున్నాడు నగేషు పాత్రో.