ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు రెడీ

ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు రెడీ
  • మహాపూజకు రెడీ అయిన మెస్రం వంశీయులు
  •  రాత్రివేళ ఆలయ శుద్ధి.. నాగోబాకు అభిషేకం  

ఆదిలాబాద్, వెలుగు : ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు అంతా రెడీ అయ్యింది. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం పుష్యమాస అమావాస్య సందర్భంగా మెస్రం వంశీయులు గోదావరి నది హస్తినమడుగు నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో ఆలయాన్ని శుద్ది చేస్తారు. తర్వాత చేసే మహాపూజతో జాతర ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటలకు సతీక్ పూజ జరుపుతారు. ఫిబ్రవరి 2న పెర్సాపేస్ పూజ, బాన్పేస్ పూజ, 3న మండగాజిలి పూజ, 4న బేతల్ పూజ నిర్వహిస్తారు. ఈ జాతరకు జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. మెస్రం వంశంలో చనిపోయిన వారికి శనివారం అర్ధరాత్రి తూమ్ ( కర్మకాండ ) నిర్వహించారు. దీనివల్ల మెస్రం వంశంలో మరణించిన వారు నాగోబా సన్నిధికి చేరుతారనేది వారి నమ్మకం.

మహాపూజతో ప్రారంభం..

మర్రిచెట్టు వద్ద మూడు రోజుల పాటు సంప్రదాయ పూజలు నిర్వహించిన మెస్రం వంశీయులు సోమవారం ఉదయం డోలు, పేప్రే, కాశికోమ్ వాయిస్తూ నాగోబా ఆలయానికి చేరుకుంటారు. ఎడ్ల బండ్లతో నాగోబా ఆలయం పక్కనే ఉన్న గోవడ్ వద్దకు వెళ్లి బస చేస్తారు. మర్రి చెట్టు దగ్గర ఉన్న బావి నుంచి సిరికొండ మండలం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మట్టి కుండల్లో మెస్రం వంశీయుల అల్లుళ్లు  నీటిని తోడితే ..ఆడపడుచులు వాటిని నాగోబా ప్రాంగణానికి మోసుకొస్తారు. ఆ నీటితో ఆలయం పక్కనే ఉన్న మట్టిపుట్టను అల్లుళ్లు తవ్వితే.. ఆ మట్టితో ఆడపడుచులు తిరిగి కొత్తపుట్టను తయారు చేస్తారు. ఆ పుట్ట మట్టిని ఉండల రూపంలో తీసుకొని ఏడు వరుసలతో బౌల దేవతను చేసి పూజలు చేస్తారు. ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం వరకు కొనసాగుతుంది. రాత్రి 10 గంటలకు గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు అభిషేకం చేస్తారు. ఈ మహాపూజలో మెస్రం వంశీయులు మాత్రమే పాల్గొంటారు. అర్ధరాత్రి వేళ మెస్రం వంశంలో ఇప్పటి వరకు నాగోబా సన్నిధికి రాని కొత్త కోడళ్లను, వారి కుటుంబ సభ్యులు నాగోబా దర్శనం ( భేటింగ్ ) చేయిస్తారు. వంశ పెద్దలను పరిచయం చేసి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ భేటింగ్ తోనే వారు మెస్రం వంశీయులుగా మారుతారని విశ్వసిస్తారు. 

బందోబస్తు ఏర్పాటు

మెస్రం వంశీయులు బస చేసే గోవడ్ ను రంగులతో అందంగా అలంకరించారు. ఆలయంలో భక్తులు క్యూలో ఉండేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. కొవిడ్ రూల్స్​ పాటించేలా భక్తులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు ఆఫీసర్లు రెడీ అయ్యారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.