
నల్గొండ అర్బన్, వెలుగు : ఆగస్టు 15 నాటికి వనమహోత్సవ లక్ష్యాన్ని పూర్తిచేయాలని స్థానిక సంస్థల ఇన్చార్జి, అడిషనల్ కలెక్టర్ నారాయణ్ అమిత్ అధికారులను ఆదేశించారు. గురువారం నల్గొండ కలెక్టరేట్లో ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనమహోత్సవం కింద గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం వంటి పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్ కుమార్, డీఆర్డీవో పీడీ శేఖర్ రెడ్డి, డీపీవో వెంకయ్య, జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.