రూ.3,200 కోట్ల టర్నవర్ తో లాభాల బాటలో డీసీసీబీ : బ్యాంకు చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

రూ.3,200 కోట్ల టర్నవర్ తో లాభాల బాటలో డీసీసీబీ  : బ్యాంకు చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లా కేంద్ర సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ రూ.3,200 కోట్ల టర్నవర్ తో లాభాల బాటలో పయనిస్తోందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. డీసీసీబీ పాలకవర్గం పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించడాన్ని హర్షిస్తూ శుక్రవారం నల్గొండలోని సహకార బ్యాంకు ఎదుట సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి లో ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం రూ.2,300 కోట్లు ఉండగా, దానిని రూ.598.16 కోట్లకు పెంచుకున్నట్లు తెలిపారు. ఆరు నెలల్లో సహకార వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు. తమ పాలకవర్గం అధికారం చేపట్టిన నాటికి రూ.900 కోట్ల టర్నోవర్ లో ఉన్న బ్యాంకును డైరెక్టర్లు, అధికారుల సమష్టి కృషితో ఆన్ ఆడిట్ ప్రకారం రూ.42.31 కోట్ల లాభాల్లోకి తెచ్చామన్నారు. 

బ్యాంకు రాష్ట్రంలో గతంలో 8వ స్థానంలో ఉండగా, నేడు రెండో స్థానానికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. పంట రుణం ఎకరానికి రూ లక్ష ఉండగా, దానిని నేడు రూ.లక్షా 50 వేలకు పెంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఏసీ రెడ్డి దయాకర్ రెడ్డి,డైరెక్టర్లు పాశం సంపత్ రెడ్డి, కొండ సైదయ్య, జయరాం, జి.సైదులు, బి.శ్రీనివాస్, కె.వీరస్వామి, గొల్లగూడ పీఏసీఎస్​చైర్మన్ నాగరత్నం రాజుపాల్గొన్నారు.