రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చినం : మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చినం : మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నల్గొండ జిల్లా  మునుగోడులోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటు, మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ కోసం కూడా రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాకు దాదాపు రూ.6వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. సీఎం కేసిఆర్ దూరదృష్టి వల్ల వచ్చిన పల్లె ప్రగతి ట్రాక్టర్ల వల్ల గ్రామ పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరిగిందన్న మంత్రి... కొంతమంది కావాలనే కిస్తీలకు కూడా డబ్బులు అడుగుతున్నారన్నారు. రైతు కళ్ళాలు, రైతు వేదికలు కట్టొద్దని కేంద్రం అంటోందని, ఉపాధి హామీ పథకం కింద అత్యంత నాణ్యమైన పనులు చేసింది మన రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మనకు కేంద్రం నుంచి రూ.703 కోట్లు రావాల్సి ఉండగా రూ.150 కోట్లు రైతు కళ్ళాలకు ఖర్చు చేశామని అన్ని నిధులు ఆపారని ఆరోపించాకరు. ప్రతి గ్రామానికీ రోడ్ల వసతి ఉండాలన్నది సీఎం కేసిఆర్  ఆదేశమన్న ఎర్రబెల్లి...  అన్ని చోట్లా రోడ్లు వేస్తామని చెప్పారు.

రావలసిన డబ్బులను ఆపి కేంద్రం ఇబ్బంది పెడుతోంది

మన ప్రభుత్వం వచ్చాక మన గ్రామ పంచాయతీలు ఇతర రాష్ట్రాలలోని పట్టణాలతో పోటీ పడుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. గ్రామాలకు వలసలు తిరిగి వస్తున్నాయన్న మంత్రి... నిజాయితీగా పని చేసిన సర్పంచులు ఆ గ్రామ పంచాయతీకి ఎక్కువ నిధులను పొందుతున్నారన్నారు. కొంతమంది డ్రామాలు చేసి ప్రభుత్వం చేసే మంచి పనులకు మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కేంద్రం మనకు రావలసిన డబ్బులు ఆపి ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం కింద వీళ్ళు మంచి పనులు చేస్తున్నారని గుర్తించి కుట్ర పన్ని ఆ పథకాన్ని ఆపే ప్రయత్నం చేస్తోందన్నారు. గతంలో కేంద్రం నుంచి ఒక టీమ్ లో ముగ్గురు అధికారులు వచ్చి చూసేవారని, కానీ ఈసారి 18 టీమ్స్ వచ్చి చూడడం విశేషమని చెప్పారు. అవి కూడా కలెక్టర్ కు సమాచారం ఇవ్వకుండా నేరుగా గ్రామాలకు వెళ్లి చూస్తున్నారన్నారు. కానీ బీజేపీ నేతలకు ఇవేవీ తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము రైతు కళ్ళాల కోసం ఖర్చు చేస్తే వాటికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు ఆపి మిగిలిన నిధులు ఇవ్వమని అడిగినా ఇవ్వడం లేదని ఆరోపించారు.