Summer Tour : తెలంగాణలో ఆలయాల గ్రామం అడవిదేవునిపల్లి.. ప్రపంచంలోనే పడమర దిక్కుగా ఉన్న ఏకైక సూర్యదేవాలయం ఇదే..!

Summer Tour : తెలంగాణలో ఆలయాల గ్రామం అడవిదేవునిపల్లి.. ప్రపంచంలోనే పడమర దిక్కుగా ఉన్న ఏకైక  సూర్యదేవాలయం  ఇదే..!

అడవిదేవులపల్లి.. పేరుకు తగ్గట్టుగానే ఊళ్లో బోలెడు ఆలయాలు ఉన్నాయి. ఊరి చుట్టూ అడవి ఉంది. ఈ ఊరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. చారిత్రకంగా మన దేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన నవబ్రహ్మ ఆలయాలు, బౌద్ధమగుళ్లు ఉన్నాయిక్కడ. అంతేకాదు ఇక్కడున్న సూర్యదేవాలయం ఎంతో ప్రత్యేకం. చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశంలోని అరుదైన ఆలయాల్లో ఒకటి. 

దేశంలో  సూర్యదేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి ఒడిశాలోని కోణార్క్, శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో సూర్యదేవాలయాలు. ఆ తర్వాత అంతటి చారిత్రక ప్రాశస్త్యం ఉన్నది ఇక్కడి ఆలయానికే. ఈ ఆలయానికి మరో విశిష్టత ఏంటంటే.. దేశంలోని అన్ని సూర్యదేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటే ఇది మాత్రం పడమర ముఖంగా ఉంది. అంతే కాకుండా. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో సూర్య భగవానుడి పాదాల చెంత సూర్యకిరణాలు పడతాయి. ప్రతిరోజూ సాయంత్రం స్వామివారికి నిత్య పూజలు చేస్తారు. ఇక్కడ శని దేవుడికి ప్రత్యేకంగా పూజలు జరుగుతుంటాయి. తొలి ఏకాదశి రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కృష్ణా నదిలో స్నానమాచరించి పూజలు చేస్తుంటారు. ప్రతి ఏటా చెన్నకేశవ స్వామి కల్యాణం వైభవంగా జరుగుతుంది. 

ఎనిమిది వందల ఏళ్ల క్రితం 

ఈ ప్రాంతాన్ని క్రీ.శ.1213వ సంవత్సరంలో కల్యాణ చాళుక్య చక్రవర్తి త్రిభువన మల్లదేవుడు పాలించేవాడు. ఆయన సామంత రాజుల్లో ఒకడైన 'తొండయ చోడ". ఆయన కృష్ణానది ఒడ్డున పార్వతి, శివుడు, విష్ణువు ఆలయాలు కట్టించాడు. అప్పట్లో ఆలయాల అభివృద్ధి కోసం ప్రజల నుంచి  రూకలు అనే పేరుతో  పన్ను వసూలు చేసేవాళ్లు. అందులో భాగంగానే కృష్ణానది దాటేందుకు పడవ ప్రయాణం చేసేవాళ్ల నుంచి ఏడు రూకలు పన్నుగా వసూలు చేసేవాళ్లు. ఆ డబ్బును ఈ ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ఖర్చు చేసేవాళ్లు. ఆచార్య నాగార్జునుడు కూడా బౌద్ధమతాన్ని ఈ ప్రాంతం నుంచే వ్యాప్తి చేశాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సమీప గ్రామాలైన చిట్యాల, ముదిమాణిక్యంలో ఉన్న బౌద్ధ ఆరామాలు, గుహల్లో కనిపిస్తున్నాయి. 

త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి ఇక్కడ సర్పయాగం చేశాడట. అప్పుడు ఈ ప్రదేశంలోనే కాకాసురుడు అనే రాక్షసుడిని చంపాడని, అందుకే ఈ ప్రాంతంలో కాకులు కనిపించవని ప్రచారంలో ఉంది. 

ఆలయాలకు కేంద్రం 

ఒకే చోట శైవ, వైష్ణవ, శాక్తేయ సంప్రదాయాల కలయిక చాలా అరుదుగా కనిపిస్తుంది. వాటితోపాటు ఇక్కడ బౌద్ధం  కూడా విలసిల్లింది. ఈ ప్రాంతంలో శివ, పార్వతి, వినాయక, అయ్యప్ప, సుబ్రహ్మణ్యేశ్వర, రామలింగేశ్వర, ఆంజనేయ, చెన్నకేశవ, సూర్యనారాయణ, నాగేంద్ర స్వామి, నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. అంతేకాదు పదో శతాబ్దంలో నిర్మించిన బౌద్ధమ గుళ్ళు కూడా ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఇప్పటికీ నిత్య ధూపదీపారాధనలు జరుగుతున్నాయి

పండుగ రోజుల్లో, ఉత్సవాలు జరిగే సందర్భాల్లో జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. చెన్నకేశవ స్వామి కల్యాణం, ధర్మకర్త పండుగ రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆలయాలకు వచ్చే భక్తుల కోసం రవాణా సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఆలయాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే, కాబట్టి ఆలయాలను అభివృద్ధి చేయాలి.

ఎలా వెళ్లాలి..

హైదరబాద్ నుంచి వెళ్లే వాళ్లు నల్గొండ వెళ్లాలి. అక్కడి నుంచి నార్కెట్పల్లి-అద్దంకి(45వ జాతీయ రహదారి) గుండా మిర్యాలగూడ వెళ్లాలి. అక్కడి నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే దామరచర్ల వస్తుంది. అక్కడి నుంచి నుంచి వీర్లపాలెం పాతిక కిలోమీటర్లు ప్రయాణిస్తే అడవిదేవులపల్లికి చేరుకోవచ్చు..